GT vs CSK | గుజరాత్‌పై చెన్నై ఘనవిజయం !

  • హీటెక్కిన టాప్ 2 రేసు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంటుండటంతో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారాయి. తాజాగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ ఫ్యాన్స్‌కు గర్వించదగిన విజయం అందించారు.

ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్నా… చెన్నై జ‌ట్టు త‌మ ఆఖ‌రి మ్యాచ్ లో దూకుడు ప్ర‌ద‌ర్శించింది. గుజరాత్ టైటాన్స్‌పై 83 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సీజ‌న్ కు మెరుగైన గుడ్‌బై చెప్పింది.

ఆఖ‌రి మ్యాచ్ లో మెరిసి చెన్నై.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 230 ప‌రుగులు న‌మోదు చేసింది. ముందుగా బ్యాట్ తో బెద‌ర‌గొట్టిన చెన్నై… ఆ త‌రువాత బంతితో బెంబేలెత్తించింది. దీంతోదీంతో భారీ ప‌రుగుల ల‌క్ష్యంతో ఛేజింగ్ కు దిగిన గుజరాత్.. 147 ప‌రుగుల‌కే కుప్పకూలింది.

నేటి మ్యాచ్ జరిగిందిలా..

ఇదిలా ఉంటే నేటి మ్యాచ్ లో చెన్నై బ్యాట‌ర్లు దంచికొట్టారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ పై విరుచుకుప‌డ్డారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. గుజరాత్ జట్టు 231 పరుగులు భారీ లక్ష్యాన్ని ముందుంచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డెవాన్ కాన్వేలు అద్భుతంగా ఆడారు. సీఎస్కే బ్యాటర్ ఆయుష్ మాత్రే (34) విధ్వంసం సృష్టించాడు.

ఉర్విల్ పటేల్ (37), శివమ్ దూబే (17) దంచికొట్టగా… డెవాన్ కాన్వే(52) అర్ధ‌శ‌త‌కంతో రెచ్చిపోయి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపించింది.

చివర్లో డెవాల్డ్ బ్రెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన‌ బ్రెవిస్… 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో 57 పరుగులు చేశాడు.

రవీంద్ర జడేజా 18 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 21 పరగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారుక్ ఖాన్ తలో వికెట్ తీశారు.

అనంత‌రం ఛేజింగ్ కు దిగ‌న గుజ‌రాత్ టైటాన్స్ సొంత గ‌డ్డ‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ల ధాటికి కుప్ప‌కూలింది. భారీ ఛేద‌న‌లో ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (41) మిన‌హా… మ‌రెవ్వ‌రూ అంత‌కా రాణించ‌లేదు. టాపార్డ‌ర్‌లో గుజ‌రాత్ 3 వికెట్లు కోల్పోగా.. మిగిలిన బ్యాట‌ర్లు కూడా చేతులెత్తేశారు.

సీఎస్ కే బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. ఖలీల్ ఖాన్, మతిషా పతిరానా తలా ఒక వికెట్ తీశారు.

గుజ‌రాత్ టాప్ స్పాట్ ప్ర‌మాదంలో..

మరోవైపు, ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే అర్హత పొందిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి… టాప్ స్పాట్‌ను మరింత బలపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, సీఎస్కే చేతిలో ఓట‌మితో జిటి అగ్ర‌స్థానం కాస్త ఇరుకాటంలో ప‌డింది. లీగ్ ప్లేఆఫ్స్ సమీపిస్తున్న వేళ టాప్ 2 స్థానాల కోసం పోటీ మరింత వేడెక్కింది. ప్రస్తుతం గుజరాత్ 18 పాయింట్లతో ఉన్నప్పటికీ… వారి అగ్రస్థానం ఇప్పుడో మిస్టరీగా మారింది.

టాప్ 2 రేసులో పంజాబ్, బెంగ‌ళూరు !

ఆ స్థానం కోసం ప్ర‌త‌స్తుం పంజాబ్, బెంగ‌ళూరు జ‌ట్లు కాసుకుని ఎదురుచూస్తున్నాయి. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 17 పాయింట్లతో 2వ, 3వ స్థానాల్లో నిలవగా… ఇరు జట్లకు ఇంకా ఒక్కో మ్యాచ్ మిగిలి ఉంది. ఒక్క విజయం తమ ఖాతాలో చేరితే… టాప్ 2లో అడుగుపెట్టి ప్లేఆఫ్స్‌లో స్ట్రాంగ్ అడ్వాంటేజ్ పొందే అవకాశం కలుగుతుంది.

ఈ నేపథ్యంలో లీగ్ టేబుల్ టాప్ పోజిషన్ల కోసం కొనసాగుతున్న పోటీ.. క్రికెట్ ప్రేమికుల్ని మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. టాప్ 2లో నిలబడితే ఫైనల్ చేరుకునే అవకాశాలు మెరుగవుతాయి కాబట్టి, ప్రతి మ్యాచ్ ఇప్పుడు నాకౌట్ లాగే మారింది.

Leave a Reply