జీఎస్టీ తగ్గుదలపై కర్నూలు జిల్లా అధికారుల ప్రచారం

జిమ్, యోగా సెంటర్లు, సెలూన్లలో అవగాహన

(కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా అధికారులు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ (Super GST Super Saving) అవగాహన కార్యక్రమాలను సోమవారం ఉదయం నిర్వహించారు. ప్రజల్లో కొత్త జీఎస్టీ స్లాబు(GST Slab)లపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. జిల్లా క్రీడా మైదానం, జిమ్‌ సెంటర్లు, యోగా కేంద్రాలు, సెలూన్లలో వినియోగదారులకు కొత్త జీఎస్టీ రేట్ల గురించి వివరించారు.

అధికారులు మాట్లాడుతూ.. ఆరోగ్య, వ్యక్తిగత బీమాలపై జీఎస్టీ లేకుండా యోగా, జిమ్‌ సెంటర్లలో చెల్లించే రుసుములపై, క్రీడా సామ‌గ్రిపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారని తెలిపారు. దీని వలన వినియోగదారులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా నూతన జీఎస్టీ స్లాబ్‌లపై కరపత్రాలను పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

ఎస్‌జె కాంప్లెక్స్‌లోని బీట్స్‌ జిమ్‌ సెంటర్‌, వెంకటరమణ కాలనీలో వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని యోగా సెంటర్‌, మౌర్యఇన్‌ హోటల్‌ ప్రాంగణంలోని సెలూన్‌, బిర్లా కాంపౌండ్‌లోని ఫిట్‌ప్యాక్‌ జిమ్‌ సెంటర్‌లలో అధికారులు వినియోగదారులకు వివరాలు అందించారు. ఈ కార్యక్రమాల్లో సెట్కూర్‌ సీఈఓ వేణుగోపాల్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతి, డీసీహెచ్ఎస్‌ జఫ్రుల్లా, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌ కుమార్‌ రెడ్డి, జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్లు రామకృష్ణ, గాయత్రి పాల్గొన్నారు.

Leave a Reply