మహానగరం చుట్టూ ఆదాయ వనరుల వృద్ధి

మహానగరం చుట్టూ ఆదాయ వనరుల వృద్ధి

  • ‘విజన్‌-2047’ ప్లాన్‌తో పెట్టుబడులకు భరోసా
  • వైబ్రెంట్‌ తెలంగాణ పేరుతో పెట్టుబడుల ఆహ్వానం
  • సీఎం కార్యాచరణ ఫలిస్తే.. తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌!
  • ఓఆర్‌ఆర్‌కు వెలుపల ట్రిపుల్‌ఆర్‌ వరకు ప్రాజెక్టులు
  • పీపీపీ మోడ్‌లో ప్రాజెక్టులు నెలకొల్పేందుకు చర్యలు
  • త్వరలో పారిశ్రామికవేత్తలతో మరోమారు సీఎం రేవంత్‌ కీలక భేటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : వాణిజ్య, వ్యాపార, స్థిరాస్తి, తయారీ, ఎగుమతి, ఈ-కామర్స్‌(E-commerce) రంగాల్లో శరవేగంగా అభివృద్ధి వైపు దూసుకెళుతున్న హైదరాబాద్‌ మహానగరాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయ వనరులను మెరుగుపరుచుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా గట్టి పట్టుదలతో, నిర్దేశిత‌ లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని నగరం మినహా రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి సంస్థలేవీ ఆసక్తి చూపకపోవడంతో ముఖ్యమంత్రి(Chief Minister) కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

భార‌త్ ప్యూచ‌ర్ సిటీకి అనుసంధానంగా…

భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి అనుసంధానంగా రీజినల్‌ రింగ్‌(Regional Ring) రోడ్డు, రేడియల్‌ రోడ్లు, మెట్రో రెండోదశ, పారిశ్రామిక కారిడార్లు, స్పెషల్‌ రెసిడెన్సియల్‌ జోన్లు.. ఇలా అనేక కోణాల్లో భవిష్యత్తు కోసం శాశ్వత పునాదులు వేస్తున్నారు. ఇప్పుడున్న 360 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధి దాదాపు రెండింతలు విస్తరిస్తున్నరీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు పారిశ్రామిక పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నెలల్లోనే లండన్‌(London) పర్యటనతోపాటు ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో సంప్రదింపులు జరిపి పెట్టుబడులను ఆహ్వానించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆ పెట్టుబడుల ఒప్పందాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి, సంబంధిత ఉన్నతాధికారుల ద్వారా వారితో చర్యలు జరుపుతూ పెట్టుబడుల కోసం అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే, పెట్టుబడిదారులంతా ప్రధానంగా హైదరాబాద్‌(Hyderabad) చుట్టే ఆసక్తి చూపుతుండడంతో మహానగరం నలు మూలలను ఆదాయ వనరులుగా మార్చాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇటీవల సమీక్షలో సీఎం రేవంత్‌ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

ఆ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, పరిశ్రమలు, ఐటీ శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో రాజధాని చుట్టూ ఆదాయ వనరులు పెంచే మాస్టర్‌ ప్లాన్‌(Master Plan)పై అధ్యయనం కొనసాగుతోంది. అభివృద్ధి కార్యాచరణలో పాటే అదాయ మార్గాలు వచ్చేలా.. రెండు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు మొదలు పెట్టారు. వైబ్రెంట్‌ తెలంగాణ పేరుతో పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. వారికి అవసరమైన వనరులు, వసతులు, రాయితీలతో ప్రోత్సాహకాలు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి యోచిస్తున్నారు.

ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌కు ఇరు వైపులా అభివృద్ధి ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌ జోన్‌, ఉత్తర తెలంగాణ జోన్‌(Telangana Zone), దక్షిణ తెలంగాణ జోన్‌.. ఇలా మూడు విభాగాలు చేయడం ద్వారా అభివృద్ధి లక్ష్యాలు చేరుకునేందుకు మార్గాల సులభతరమవుతాయని ముఖ్య‌మంత్రి భావిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదబాద్‌ జోన్‌ మాత్రమే అంతర్జాతీయ పెట్టుబడులకు అనువైన వాతావరణం కలిగి ఉందని అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రకారం మిగతా రెండు జోన్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి, సంబంధిత ప్రాజెక్టులను ప్రోత్సహించనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక సుస్థిరతను సాధించాలంటే పీపీపీ మోడ్‌(PPP Mode)లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రోత్సహించడమే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముందుకు సాగుతున్నారు.

విజన్‌-2047 మాస్టర్‌ ప్లాన్‌తో పెట్టుబడులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర భవిష్యత్తుపై సర్కారు దూరదృష్టితో చర్యలు ప్రారంభించింది. ఆర్థిక వ్యవస్థను సుస్థిర పరిచే దిశగా అధికార యంత్రాంగానికి బాద్యతలు అప్పగించి స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు. త్వరలో పారిశ్రామికవేత్తలతో మరోమారు సమావేశమై ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. వరల్డ్‌ టాప్‌ -టెన్‌(World Top Ten) సిటీల్లో ఒకటిగా హైదరాబాద్‌ను నిలబెట్టేలా ప్రణాళిక అమలు చేయడం ద్వారా పెట్టుబడులతో వచ్చే పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాల్లో ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారు.

వచ్చే ముప్పై ఏండ్లలో హైదరాబాద్‌ సిటీ ఎలా ఉండాలన్న‌దానిపై సుదీర్ఘమైన కసరత్తు జరుగుతోంది. ఇందుకు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌(HMDA Master Plan) రెడీ చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వైబ్రెంట్‌ తెలంగాణ-2050 పేరుతో ప్లాన్‌ తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే సిటీలో ఐదు మాస్టర్‌ ప్లాన్‌లు ఉన్నాయి. ఐదు మాస్టర్‌ప్లాన్‌లను కలిపి యూనిఫైడ్‌గా అమలు చేస్తే ఎలా ఉంటుదనే దానిపైనా ఆలోచన కూడా చేశారు.

భవిష్యత్‌లో 7 మాస్టర్‌ప్లాన్‌లతో సిటీ అభివృద్ధిలో మరింత దూసుకుపోతుందని అధికారులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వైబ్రంట్‌ తెలంగాణకు రూపకల్పన చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే రెండు కొత్త మాస్టర్‌ ప్లాన్‌లు అయిన ఎకనామికల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఈడీఎంపీ), కాంప్రహెన్సివ్‌మొబిలిటీ- (సీఎంపీ)ని కూడా రాష్ట్ర సర్కార్‌ అమలు చేయనుంది.

ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు ద్వారా అంతర్జాతీయంగా టాప్‌ టెన్‌ సిటీల్లో హైదరాబాద్‌ ఒకటిగా ఉండాలనే దృష్టితో రూపకల్పన చేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే తొలుత ఆర్థికంగా కూడా ఎదగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఎకనామికల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌(Development Plan) (ఈడీపీ) పేరుతో సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

వచ్చే 30 ఏండ్ల ప్లాన్‌ లో సిటీని ఆర్థికంగా అభివృద్ధి చెందించడం, తద్వారా వరల్డ్‌ లో టాప్‌ 10 సిటీల్లో ఉండేలా చేయాలనే దానిపై పక్కా ప్లాన్‌ రూపొందుతున్నట్టు చెప్పారు. సిటీలో ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలి, ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే వాటిపై ప్లాన్‌ ఉండనున్నట్టు- పేర్కొంటున్నారు. పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పిన, భారీగా పెట్టుబడులు పెట్టేలా విదేశీ, స్వదేశీ కంపెనీలను ఆహ్వానించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు.

అధికసంఖ్యలో పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు, స్థానిక వనరులను కూడా వాడుకుని ఆర్థికంగా సిటీ బలంగా ఎదిగేందుకు ఎలాంటి విధివిధానాలను అమలు చేయాలనే అంశాలను కూడా ప్లాన్‌లో పొందుపరుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌(Public Transport) డెవలప్‌మెంట్‌పై ప్లాన్‌ సిటీలో పెరిగే జనాభాకు అనుగుణంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందేలా ఒక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని అధికారులు నిర్ణయించారు.

ఇందులో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి సమగ్ర ప్రజా రవాణా ప్లాన్‌ (సీఎంపీ)ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం సిటీలో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటిపోయింది. రోజుకు 3వేలకు పైగా కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ జామ్‌లు ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు కాలుష్యం కూడా పెరుగుతోంది. కొత్త మాస్టర్‌ ప్లాన్‌లోనూ ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలనే అంశాలను కూడా చేర్చనున్నారు.

సొంత వాహనాల వాడకం తగ్గించడం, పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తే బాగుంటుదనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. నేషనల్‌ అర్బన్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ పాలసీ(ఎన్‌యూటీ-పీ)కి అనుగుణంగా ప్రజలకు ఉపయోగంగా ఉండేలా, వారు ఖర్చు భరించే స్థాయిలో దీర్ఘకాల రవాణా వ్యూహాలు ఎలా ఉండాలనేవి కూడా మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపరుస్తారు. ఇలా మొత్తంగా పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ క్రమంలోనే రాజకీయంగా ఎన్నివిభేదాలున్నా.. ప్రభుత్వంగా కేంద్రంతో సమన్వయం కొనసాగిస్తూ.. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను సాధించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో పాటు- రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్‌ – నాగపూర్‌, హైదరాబాద్‌- వరంగల్‌, హైదరాబాద్‌ – నల్గొండ, హైదరాబాద్‌- బెంగళూరు, సింగరేణి ఇండస్ట్రియ్రల్‌(Industrial) లాంటి ఐదు ఇండస్ట్రియల్‌ కారిడార్ల ఏర్పాటు, సైనిక్‌ పాఠశాలలు, కేంద్ర విద్యాసంస్థలు, నవోదయ విద్యాసంస్థల సాధన, డ్రైపోర్ట్‌ నిర్మాణం, క్రీడా విశ్వవిద్యాలయం,

మైనింగ్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు-, ఐటిఐఆర్‌ ప్రాజెక్టు సాధన, మేడారం జాతరకి జాతీయ పండుగగా గుర్తింపు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా సాధన, రైల్వే ప్రాజెక్టుల సాధన, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు-, సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు, నీతి ఆయోగ్‌ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు- లాంటి వాటిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధించటం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కొత్త రూపం ఇవ్వాలనేదే రేవంత్‌ రెడ్డి విజన్‌గా స్పష్టత కనిపిస్తోంది.

Leave a Reply