భూగర్భ జలాలను పెంచాలి..

- తక్షణం చర్యలు తీసుకోవాలి
- కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు బ్యూరో , ఆంధ్రప్రభ : జిల్లాలోని మిగిలిన 206 చెరువులను నీటితో నింపటానికి చర్యలు తీసుకోవాలి, భూగర్భ జలాలను గణనీయంగా పెంచాలి అని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంకాలం ఇరిగేషన్ శాఖపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి ప్రాజెక్టుల పురోగతి, సాగునీటి సదుపాయాలు, నిల్వలు, నీటి పంపిణీ కి సంబంధించిన ప్రణాళికలు, మరియు కావలసిన ఏర్పాట్లపై వివరంగా ఆరా తీశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని ప్రముఖ నీటి వనరుల ప్రాజెక్టులు వేదవతి , క్రిష్ణగిరి, గుండ్రేవుల, గాజులదిన్నె, కోసిగి, పందికోన ( పత్తికొండ ) , హాలహర్వి, మొలగవల్లి , హెచ్ ఎన్ ఎస్ ఎస్, టి బి ఎల్ ఎల్ సి మొదలగు ప్రాజెక్టులు వాటి వివరాలు, నీటి లభ్యత ,ఆయకట్టు, మిగిలిన సర్వే పనులు, చెల్లించవలసిన మొత్తాలు మొదలగు విషయాల పై వివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో ముఖ్యంగా అవార్డు అయిన భూములకు ఎంత సొమ్ము చెల్లించాలి అనే విషయాలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో చేసిన ఒక నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించినారు.
జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నింపుతున్న 40 ట్యాంకులు కు అదనంగా మిగిలిన 206 చెరువులను నింపడానికి తీసుకోవలసిన చర్యలను , ఖర్చు వివరాలను నివేదిక ద్వారా వెంటనే తెలపాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో భూగర్భ జలాలను పెంచడానికి అన్ని చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ బాలచంద్రారెడ్డి,ఎస్ఈ ఆర్ డబ్లు ఎస్ మానోహర్ ,హెచ్ ఎన్ ఎస్ ఎస్ ఎస్ఈ పాండు రంగయ్య,ఎస్ డి సి లు వెంకటేశ్వర్లు, అనూరాధ , ఇంజనీర్లు ప్రసాద్, గుణకర్ రెడ్డి , రామ కృష్ణ, యుూనీట్ 3 చెందిన అధికారులు పాల్గొన్నారు.
