నవీన్ యాదవ్ కు ఏకగ్రీవంగా మద్దతు
యూసఫ్ గూడా, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) కు గౌడ సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సినీ నటుడు సుమన్, హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర ముఖ్య నేతలు, గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ… యాదవులు, గౌడలు వేరు కాదు.. అందరం బలహీన వర్గాల బిడ్డలమన్నారు. మనమంతా ఉన్నత స్థానాల్లో ఉండాలి.. ఐక్యంగా ఉండాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలహీన వర్గాల బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు మనమంతా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో బలహీన వర్గాల బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలన్నారు.

జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వారైనా వారి వల్ల ఓటర్లు ప్రభావితం అయ్యేవారు ఉంటే వారి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని అడగాలన్నారు. నవీన్ యాదవ్ స్థానికుడు, విద్యావంతుడు, జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఆయన కృషి చేస్తారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాలన్నారు.

