రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన పరిస్థితుల్లో అందాల పోటీలు నిర్వహించడం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. ఒకవైపు రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటే ప్రభుత్వం అందాల పోటీలకు ప్రాధాన్యత ఇవ్వడం పైన కేటీఆర్ ప్రశ్నించారు.
అంతర్జాతీయ పోటీల రిలవన్స్ పూర్తిగా పోయింది, కానీ దాన్ని ఏదో అంతర్జాతీయ ఈవెంట్ సాధించినంత గొప్పగా ప్రచారం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం అని విమర్శించారు. అందాల పోటీల వలన ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఎట్లా వస్తాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
మిస్ వరల్డ్ పోటీలకు 55 కోట్లు ఖర్చు పెడితే తప్పా… అని మాట్లాడుతున్న ప్రభుత్వం 46 కోట్ల రూపాయలను ఫార్ములా -ఈ కోసం ఖర్చు పెడితే ఏ విధంగా నష్టం జరిగిందో చెప్పాలన్నారు. ఫార్ములా ఈ రేసుని ఏకపక్షంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా రద్దు చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 46 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు.
ఫార్ములా ఈ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూర్ఖత్వ నిర్ణయం వలన నష్టం జరిగిందన్నారు. ఫార్ములా-ఈ వలన రాష్ట్రానికి ఎలక్ట్రానిక్స్ రంగంలో అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. జహీరాబాద్ తో పాటు రంగారెడ్వి, వెనకతల, మహబూబ్నగర్ వంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి, టెస్లా వంటి కంపెనీ రాష్ట్రం వైపు చూసిందన్నారు.
33 సంవత్సరాల టివోటి పద్ధతిలో అవుటర్ రింగ్ రోడ్డుని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానేమో తప్పని చెప్పారు, కానీ టూరిజం పాలసీలో మాత్రం 99 సంవత్సరాలకు ప్రభుత్వ భూములు, ఆస్తులను లీజుకు ఇవ్వడం ఏ విధంగా న్యాయమైతది చెప్పాలన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు అంశంలో విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టూరిజం అంశంలో ద్వంద ప్రమాణాలను పాటిస్తున్నదన్నారు.
దేశంలోని అతిపెద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు టూరిజం సర్కిల్ లో పెట్టాలని లేదు దానికి తాళాలు వేసి ఎందుకు ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కరిస్టులు విగ్రహ సందర్శనకు వస్తున్నారని, అప్పుడైనా కనీసం తెరుస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
మా ప్రభుత్వహయంలో 10 ఏండ్లు టూరిజంను బాగా అభివృద్ది చేశామని, కానీ ఏంజరగలేదన్నట్టు టూరిజం మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చామని, హైదరాబాదులో కూలీ కుతుబ్షా టూంబ్స్ తో పాటు మోజం జహీ మార్కెట్ వంటి అనేక టూరిజం ఆకర్షణలను అభివృద్ధి చేశామన్నారు.
మాజీ మంత్రి జానా రెడ్డి ప్రారంభించిన టూరిజం ప్రాజెక్టు బుద్ధవనంని మేము పూర్తి చేసామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్, కొండపోచమ్మ వంటి టూరిజం అట్రాక్షన్లను డెవలప్ చేసామన్నారు.
ప్రపంచ మహాసభలను నిర్వహించడం, గ్లోబల్ ఆంట్రపెన్యూర్ సమ్మిట్ వంటి సమావేశాలను నిర్వహిస్తే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవాంక ట్రంప్ వంటి ప్రముఖులు హాజరయ్యారన్నారు.
టూరిజం శాఖ మంత్రి నియోజకవర్గం కొల్లాపూర్ లో కూడా అనేక టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశామని, వరంగల్ లో మేము ప్రారంభించిన కాళోజి ఆడిటోరియం ని కూడా దాదాపుగా పూర్తి చేసామని, మిగిలిన ఐదు పది శాతంని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తున్నామని చెప్తుందన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సాంస్కృతిక సాంస్కృతిక సారథి ద్వారా 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ జీతాలు ఇచ్చామన్నారు. గతంలో అణచివేయబడిన తెలంగాణ భాషా, యాసను కాపాడుకునేందుకు తెలంగాణ యాస భాషకు ప్రాణప్రతిష్ట చేసినమన్నారు.