కొత్త జంటలకు గవర్నర్ ఆశీస్సులు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నూతన జంటలు ఆదర్శమైన సమాజానికి బాటలు వేయాలని, చెంచు సామాజికవర్గం సామూహిక వివాహాలు(Mass marriages) జరిపించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ(State Governor Jishnu Deva Varma) అన్నారు. ఈరోజు అచ్చంపేట పట్టణంలో ఏసీఆర్ గార్డెన్‌లో తెలంగాణ రాష్ట్ర వనవాసి కల్యాణ్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెంచు సామూహిక వివాహాలకు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ అన్నిదానాలలో కన్నా అతిపెద్ద దానం కన్యాదానం అని అన్నారు. భారతీయ సంప్రదాయంగా జరిగిన ఈ వివాహాల(marriages)తో చెంచులు తమ వివాహ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకొని సమాజానికి మెరుగైన బాటలు వేయాలని కోరారు. చెంచులు సంఖ్యాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్నా, తమ భాషా సంస్కృతి పరంగా చాలా శక్తివంతమైన వారని విద్యా, సాంకేతిక రంగాలలో ఆదివాసీలు ఉన్నత స్థాయికి ఎదగాలని, వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని వారు అన్నారు.


హర్యాన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ క్రమశిక్షణతో, సంప్రదాయబద్ధంగా వనవాసి నిర్వాహకులు సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని అన్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ వర్మ చెంచు నవ దంపతులను వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు. అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతి(Ambatreya Kshetra presiding officer) ఆదిత్య పరాశర స్వామీజీ నవ దంపతులకు వివాహ బంధం గురించి వివరించి వారిని ఆశీర్వదించారు.


అంతకుముందుకు కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయలకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీమతి టి. మాధవి(Justice Smt. T. Madhavi), వక్త గా వనవాసి కళ్యాణ ఆశ్రమం అఖిలభారత కార్యకారిణి సభ్యులు శ్రీమతి రేఖ నాగర్ తదితరులు పాల్గొన్నారు.

