ముంబయి – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6 శాతానికి తగ్గినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ముందుగానే ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు కేంద్ర బ్యాంకు కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. అన్నట్టుగానే ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది.
రెపో రేటు తగ్గించడంతో రుణగ్రహీతలకు త్వరలో ఈఎంఐలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతం దగ్గర ఉండగా 25 బేసిస్ పాయింట్ల తగ్గించడంతో 6 శాతానికి వచ్చింది. ఫిబ్రవరి 2025 ద్రవ్య విధాన సమీక్షలో చివరి సారిగా తగ్గించింది. అప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు గురవుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ అనిశ్చితి మధ్యే ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకోవడం ఒకింత రుణగ్రహీతలకు ఉపశమనంగానే చెప్పవచ్చు.