Gold chain | బైక్ పై వచ్చి.. గొలుసు తెంపుకొని వెళ్లి

Gold chain | మంగళగిరి (గుంటూరు), ఆంధ్రప్రభ : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి కొత్తపేటలోని అమ్మవారి గుడి వద్ద ఆదివారం ఉదయం ఓ వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని దుండగుడు బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. బాధితులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానికంగా నివాసం ఉండే ఈశ్వరమ్మ అనే వృద్ధురాలు ప్రతిరోజు సమీపంలోని అమ్మవారి గుడి ఎదుట శుభ్రం చేసి ముగ్గు వేసి వస్తుంటుంది.. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6.35 నిమిషాలకు అమ్మవారి గుడి వద్ద యధావిధి గా తన కార్యకలాపాలను ముగించుకుని తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని దుండగుడు ద్విచక్ర వాహనంపై వచ్చి వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. 96 గ్రాముల బరువు కలిగిన దీని విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.
