Godavarikhani | సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు గడువులో పూర్తి చేయాలి

Godavarikhani | సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు గడువులో పూర్తి చేయాలి

  • జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు : అదనపు కలెక్టర్ డి.వేణు
  • జనవరి 28 నుంచి 31 వరకు సమ్మక్క–సారలమ్మ జాతర
  • పారిశుద్ధ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి: అదనపు కలెక్టర్

Godavarikhani | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : జిల్లాలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇవాళ‌ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రామగుండం గోదావరి నది వద్ద, అంతర్గాం గోలివాడ, సుల్తానాబాద్‌లోని నీరుకుల్ల ప్రాంతాల్లో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్ల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో గోదావరిఖని, గోలివాడ, నీరుకుల్ల ప్రాంతాల్లో జరిగే జాతరకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర కమిటీకి అన్ని శాఖలు సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు.

జాతర నాలుగు రోజుల పాటు సజావుగా సాగేందుకు పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే అదనపు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని తెలిపారు. తాత్కాలిక మరుగుదొడ్లు, రోజువారీ చెత్త తొలగింపు, స్నానాల కోసం షవర్లు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని, సాయంత్రం నుంచి ఉదయం వరకు నిరంతర విద్యుత్ దీపాలంకరణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గోదావరి నది పరిసర ప్రాంతాల్లో సేఫ్టీ ఫెన్సింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు.

Godavarikhani

జాతర జరుగుతున్న నాలుగు రోజుల పాటు వైద్య సిబ్బంది, 108 అంబులెన్స్‌లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ఫైర్ ఇంజిన్‌ను 24 గంటల షిఫ్ట్ డ్యూటీల్లో సిద్ధంగా ఉంచాలని తెలిపారు. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

పుణ్యస్నానాలు చేసే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని, జాతర ప్రారంభానికి వీఐపీలను ఆహ్వానించడం, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు వంటి పనులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఆర్టీసీ ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని, జాతర పరిసర ప్రాంతాల్లో అనుమతి లేని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.

జాతర నిర్వహణలో ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాష్, సి విభాగం పర్యవేక్షకులు కుమారస్వామి, జిల్లా అధికారులు, దేవాదాయ శాఖ, సింగరేణి, ఎన్టీపీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply