Godavarikhani | టెండర్లు లేకుండా బొగ్గు గనులు

Godavarikhani | టెండర్లు లేకుండా బొగ్గు గనులు

  • సింగరేణికి కేటాయించకపోతే పోరాటం
  • కంపెనీ నిర్వీర్యానికి కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల కుట్రలు
  • పర్మినెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తులు జరగాలి
  • సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి

Godavarikhani | గోదావరిఖని, ఆంధ్రప్రభ : టెండర్ల ప్రక్రియ లేకుండానే బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల నుండి తవ్వకాల పొడిగింపున‌కు సంబంధించి సింగరేణి బొగ్గు పరిశ్రమకే కేటాయించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి హెచ్చరించారు. ఇవాళ‌ గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ… సింగరేణి పరిశ్రమను కాపాడుకునేందుకు టెండర్ల విధానాన్ని పక్కనపెట్టి బొగ్గు బావలను సింగరేణి సంస్థకే బేషరతుగా అప్పగించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు సింగరేణి బొగ్గు పరిశ్రమకు చెందిన వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో వాడుకుంటూ ఆ సంస్థను రక్షించుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుండాల‌న్నారు. సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని బొగ్గు బ్లాకులు ఇవ్వకుంటే ప్రభుత్వం ముందుండి ఉద్యమం చేయాలని రాజిరెడ్డి సూచించారు.

సింగరేణి బొగ్గు పరిశ్రమలో బొగ్గు బ్లాక్ ల కేటాయింపులు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని, పర్మినెంట్ కార్మికులతోనే బొగ్గు తవ్వకాలు చేపట్టాలన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునే విషయంలో టెండర్ల ప్రక్రియను అడ్డుకోవాలని… ఇందుకోసం సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని రాజిరెడ్డి పిలుపునిచ్చారు.

బొగ్గు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని, ఈ కుట్రలను కార్మిక సంఘాలన్నీ ఏకమై తిప్పి కొట్టాలన్నారు. సింగరేణి సంస్థకు అన్యాయం జరుగుతే సీఐటీయూ ఎప్పుడూ కూడా ముందుండి పోరాటం చేస్తుందని ప్రకటించారు. జనుకు సంస్థకు బొగ్గు బ్లాక్ లను ఇవ్వడం వల్ల ఆ సంస్థ తవ్వకాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుందని మండిపడ్డారు. గతంలో కూడా బొగ్గు బ్లాక్లను సొంతం చేసుకున్న జెన్కో ఆ తర్వాత ప్రైవేటుకు అప్పగించిందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మెండే శ్రీనివాస్, ఆరెపల్లి రాజమౌళి, కొమ్ము రమేష్, మహేష్, ప్రభాకర్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply