ఆంధ్రప్రభ బ్యూరో, నంద్యాల : కేసీ కాలువ పరివాహక ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని, తమ పంటలను కాపాడుతారా ?.. లేక ఆత్మహత్యలు చేసుకోవాలా అంటూ?.. కెసీ కాల్వ పరివాహక ప్రాంత రైతులు బుధవారం నంద్యాల పట్టణంలోని తెలుగుగంగ కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు 1200ఎకరాల పంట చేతికొచ్చే సమయంలో నీరులేక ఎండిపోతుందని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతులు అధికారులైన కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్, జేఈ నాగేశ్వర రెడ్డిలతో వాగ్వాదానికి దిగారు.
కేసీ కెనాల్ కాలువలోని 16 లాక్ నుంచి 27వ లాక్ వరకు రైతులకు నీరందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాలువలో ఒక అడుగు నీరు ప్రవహిస్తే పంట పొలాలకు నీరు ఎలా అందుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పంట పొలాలకు బోర్లు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు ఇంకా ఒకటి రెండు తడులు పెడితే పంట చేతికొస్తుందని పేర్కొంటున్నారు. సుమారుగా ఎకరాకు 50వేల రూపాయలపైన పెట్టుబడి పెట్టామన్నారు. కేసీ కెనాల్ పరిధిలోని దీబగుంట్ల, సాంబవరం, జూలేపల్లి కానాలపల్లి, సిరివెళ్ల, వీరారెడ్డి పల్లె కోటపాడు గోవిందపల్లె, యల్లూరు, ఎర్రగుంట్ల, జిల్లెల్ల, రెవనూరు, నాగులవరం, లింగం దిన్నె, పసులపాడు, ఆళ్లగడ్డ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
సుమారు 1200 ఎకరాల పంట ఎండిపోతుంటే తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని రైతులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్ కు సుమారు 5000 క్యూసెక్కుల నీరు వదిలితే కానీ ఈ పంటలు పండే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆళ్లగడ్డ తాలూకా పరిధిలోని, నంద్యాల తాలూకా పరిధిలోని కెసీ కెనాల్ కాలువ కింద వేసిన పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.