Gas Cylinders | దోపిడీకి కొత్త మార్గమా?

Gas Cylinders | దోపిడీకి కొత్త మార్గమా?

Gas Cylinders | దేశంలో గ్యాస్ సిలిండర్ల సంక్షోభం
యధేచ్చగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్ల అమ్మకం
తమ ఏజెన్సీల్లో గ్యాస్ లేదంటున్న డిస్ట్రిబ్యూటర్లు
డిస్ట్రిబ్యూటర్ల దందాను పట్టించుకోని అధికారులు
గ్యాస్ నిల్వల కొరతతో మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు
గ్యాస్ లేదంటూనే అధిక ధరలకు అమ్ముకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు

Gas Cylinders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం దేశంలో యుద్ధం కంటే ఎక్కువగా ప్రజలకు గ్యాస్‌పై గందరగోళం నెలకొంది. సహజంగా అంతర్జాతీయ పరిస్థితులు మారినప్పుడు గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతుంది. మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల్లో సరఫరా సమస్యలు వచ్చినప్పుడు భారత్‌కు వచ్చే గ్యాస్ సరఫరా కూడా కొంత మందగిస్తుంది. అయితే భారతదేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. కానీ అందుకు భిన్నంగా గ్యాస్ ధరలు పెరగడంతో ఒక్కసారిగా దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఓ వైపు గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు పడిగాపులు కాస్తుండగా, మరోవైపు కమర్షియల్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయమవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు 25 రోజులు ఉండగా ప్రస్తుతం 45 రోజులకు పెంచింది. ఈ గడువు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని, పట్టణాలకు వర్తించదని వెల్లడించింది. నిజంగా గ్యాస్ కొరత ఉందా? లేక సరఫరా వ్యవస్థలో లోపాలు ఉన్నాయా? డిస్ట్రిబ్యూటర్ల దందా కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేశంలో గ్యాస్ నిల్వలు ప్రధానంగా మూడు రూపాల్లో సరఫరా అవుతున్నాయి. ఎల్పీజీ (LPG) అంటే మన ఇళ్లలో ఉపయోగించే వంటగ్యాస్. ఎల్‌ఎన్‌జీ (LNG) అంటే ద్రవీభవించిన సహజవాయువు, ఇది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ప్రభుత్వాలు సిఎన్‌జీ (CNG) లేదా పిఎన్‌జీ (PNG) రూపంలో పైప్‌లైన్ ద్వారా సరఫరా చేసే గ్యాస్ మరో రకం. ఈ మూడు విధాలుగా గ్యాస్ సరఫరా కొనసాగుతోంది. అయితే భారత్‌లో మొత్తం ఎల్పీజీ వినియోగం సంవత్సరానికి దాదాపు 31 మిలియన్ టన్నులకు పైగా ఉంటుంది. ఇందులో దాదాపు 85 నుంచి 87 శాతం వరకు గృహ వినియోగం కాగా, మిగిలిన భాగాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలు ఉపయోగిస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం అనే ప్రభుత్వ సంస్థలు గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. అయితే వీటికి అనుబంధంగా అనేక గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో గ్యాస్ బుక్ చేస్తే రెండు లేదా మూడు రోజుల్లో వస్తుంది. కానీ ఇప్పుడు వారం రోజులు గడిచినా సిలిండర్లు రావడం లేదని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి పెద్ద నగరాల్లో గ్యాస్ నిల్వల కొరత కారణంగా చాలా హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రెండు మూడు రోజుల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా మెరుగుపడకపోతే మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్న వారు వేరే మార్గం చూసుకోవాలని హాస్టల్ యాజమానులు సూచిస్తున్నారు.

అయితే ఇంతటి సంక్షోభం రావడానికి కారణం డిస్ట్రిబ్యూటర్ల దందా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్లను నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అధికారికంగా ఒక ధర ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో మాత్రం రూ. 4000 నుంచి రూ. 6000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని హోటల్ యజమానులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ చేయాల్సిన ఆయిల్ కంపెనీలు, జిల్లా స్థాయి అధికారులు, సరఫరా శాఖలు గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా అరికట్టే చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి కుమ్మక్కయ్యారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల దందాను అరికట్టకపోతే ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply