gas cylinder shortage | గ్యాస్ డెలివర్రీ

gas cylinder shortage | గ్యాస్ డెలివర్రీ
- బుకింగ్ గోల
- ఇండక్షన్ స్టౌవ్ తో…కూరలే కూరలు
- ఈ కుక్కర్ తో బిర్యానీ మజా
- పెద్ద పెద్ద హోటళ్లది అదే దారి
gas cylinder shortage | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ ; వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పెరుగుతున్న అనిశ్చితి కారణంగా సామాన్యుల వంటగదిలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన మార్కెట్‌లో ఉన్న ఒత్తిళ్లు గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ వంట పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు.

దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాలతో పాటు విజయవాడ నగరంలో కూడా కమర్షియల్ గ్యాస్ లభ్యత తగ్గడంతో హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు కొన్ని నగరాల్లో హోటళ్లు పరిమిత మెనూతో మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా గృహ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాత డెలివరీ ఆలస్యమవుతుండటంతో డీలర్ల కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వంట పరికరాలకు మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, మైక్రోవేవ్ ఓవెన్ల అమ్మకాలు పెరుగుతున్నట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. తక్కువ ఖర్చుతో వేగంగా వంట పూర్తవుతుందనే కారణంతో చాలా కుటుంబాలు ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నాయి. విజయవాడ నగరంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తరువాత వారాల తరబడి డెలివరీ కాకపోవడంతో గృహిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎలక్ట్రికల్ షోరూమ్‌ల వద్ద ఇండక్షన్ స్టవ్‌ల కోసం వినియోగదారులు క్యూ కడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

గతంలో నెలకు ఒకటి లేదా రెండు స్టవ్‌లు మాత్రమే అమ్ముడయ్యేవని, ఇప్పుడు ఒక్కో షోరూమ్‌లో రోజుకు 10 నుంచి 20 వరకు ఇండక్షన్ స్టవ్‌లు విక్రయమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ కారణంగా మార్కెట్లో స్టాక్ నిల్వలు నిర్వహించడం కూడా వ్యాపారులకు సవాల్‌గా మారింది. కంపెనీల నుంచి సరఫరా ఆలస్యమవుతుండటంతో కొన్నిచోట్ల కొరత పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంటున్నారు. ఇక ఆన్‌లైన్ మార్కెట్ కూడా ఈ ట్రెండ్‌ను మరింత వేగవంతం చేస్తోంది.

షోరూమ్‌లలో స్టాక్ లేకపోవడం లేదా ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది వినియోగదారులు ఆన్‌లైన్ వేదికల ద్వారా ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఫాస్ట్ డెలివరీ, ఆఫర్ల కారణంగా ఆన్‌లైన్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్యాస్ సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం చాలా కుటుంబాలు ఎలక్ట్రిక్ వంట పరికరాలపై ఆధారపడుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంప్రదాయ వంటగది నుంచి స్మార్ట్ కిచెన్ వైపు ప్రజలు వేగంగా అడుగులు వేస్తున్నట్లు మార్కెట్ పరిస్థితులు స్పష్టంగా సూచిస్తున్నాయి.

