గ్యాస్ కొరత లేనేలేదు..

గ్యాస్ కొరత లేనేలేదు..

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్

విజయవాడ, ఆంధ్రప్రభ : గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన పలు అంశాలను వెల్లడించారు.దేశవ్యాప్తంగా గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఎంపీ తెలిపారు. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే వదంతులను నమ్మవద్దని సూచించారు.

గ్యాస్ సరఫరా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎంపీ స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని ఎంపీ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ పంపిణీ సంస్థల పనితీరును నిరంతరం పరిశీలిస్తున్నామని ఎంపీ వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలేం వంటి సంస్థల్లో ఎన్ని సిలిండర్లు అందుబాటులో ఉన్నాయో సమీక్షిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్యాస్ కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మి భయపడవద్దని ఎంపీ సూచించారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సరఫరా నిరంతరాయంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply