Gannavaram | వసతి గృహాల్లో సమస్యలు.. యార్లగడ్డ వెంకట్రావ్ సీరియస్..

Gannavaram | వసతి గృహాల్లో సమస్యలు.. యార్లగడ్డ వెంకట్రావ్ సీరియస్..

  • పిల్లలకు అన్నం పెట్టే విషయంలో రాజీ పడితే ఊరుకోను..
  • అధికారులకు ఎమ్మెల్యే యార్లగడ్డ హెచ్చరిక..
  • మార్పు రాకుంటే చర్యలు తప్పవు..

Gannavaram, ఆంధ్రప్రభ : గన్నవరం నియోజకవర్గంలోని ఎస్సీ, బీసీ హాస్టళ్ల పనితీరు పై ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా విద్యార్థుల వసతులను స్వయంగా పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గన్నవరం దావోజీ గూడెం వసతి గృహాలను సందర్శించిన ఆయన, విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. భోజనం నాణ్యత ఎలా ఉంది? చదువు ఎలా సాగుతోంది? ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అని ఆరా తీశారు. ఆకస్మిక తనిఖీ అనంతరం.. గన్నవరం నియోజకవర్గంలోని 13 హాస్టళ్ల వార్డెన్లు సంబంధిత అధికారులతో యార్లగడ్డ వెంకట్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చేసారి తాను తనిఖీకి వచ్చే సమయానికి విద్యార్థుల నుంచి ఒక్క ఫిర్యాదు వచ్చినా సహించేది లేదని తప్పులు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి హాస్టల్‌లో విద్యార్థులకు వేడి నీటి కోసం గీజర్లు ఏర్పాటు చేయాలని, అలాగే దోమల బెడద లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టల్ ప్రాంగణాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని స్పష్టం చేశారు.

వెనుకబడిన వర్గాల పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు అన్నం పెట్టే విషయంలో రాజీ పడకూడదన్నారు. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి, కనీస అవసరాలన్నీ తీర్చాలని సూచించారు. నియోజకవర్గంలోని హాస్టళ్లలో ఉన్న సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తానని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే తన ప్రాధాన్యతని యార్లగడ్డ వెంకట్రావు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Leave a Reply