అవిఘ్న సంకల్పమే గణపతి..

విఘ్నం అనగా ఆటంకము. మనం ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు అది విజయవంతముగా జరగాలని కోరుకుంటాము. అంతా మనం తలచినట్లే కావాలని భావిస్తాం. అయితే సంకల్పం పటిష్టంగా ఉంటే ఆ కార్యం సఫలం అవుతుంది. మనం చేపట్టే కర్మలు లోకహితంగా ఉండాలి. అప్పుడే మనకు భగవంతుడు చేయూతనిస్తాడు. స్వార్ధపూరిత ఆలోచనలే మనకు విఘ్నాలు కలిగిస్తాయి. నిజానికి మన ఆలోచనలు సందేహంతోనే ప్రారంభమవుతాయి.

ఎంతో భక్తితో పూజ ప్రారంభిస్తాము. కానీ, ఫలితాన్ని ఆశించి, అది దక్కుతుందా-లేదా? అనే సందేహంతో చేస్తాం. అయితే ఫలాపేక్ష రహితంగా చేసే అర్చన మాత్రమే లోక కళ్యాణం చేకూర్చుతుంది. ఆశ ముందు పుట్టి మనిషి తర్వాత పుడతాడు. వాస్తవానికి మనిషిని జీవింపజేసేది ఆశ మాత్రమే. జన్మనిచ్చిన పరమాత్మే మన ఆశకు ఆలంబన అని మనం నమ్ముతాము. ఆ విశ్వాసమే భగవదారాధనకు నాంది.

ఈ వేద భూమి సమస్తం మహిమలకు నిలయం. మన మనో సంకల్పమే మహిమకు వేదిక. చిత్తశుద్ధితో ఆ సృష్టికర్తను ధ్యానం చేస్తే ఒక మహిమయే కాక మనం కోరుకున్నది జరుగుతుంది. ‘సందేహాత్మ వినిష్యతి’ సందేహంతో కూడిన మనసు ఆత్మ వినాశన భావనకు దారితీస్తుంది. కావున మనం తలపెట్టే సకర్మలు పదిమందికి మేలు చేస్తే సందేహాలకు విఘ్నాలకు తావుండదు.

అటువంటి అవిఘ్న సంకల్పానికి ఆధ్యుడే విఘ్నాధిపతి గణపతి. యుగయుగాన సృష్టికి బీజమే గణపతి. ప్రతి కల్పము యొక్క ఆరంభంలో అనంత జలంలో జనించిన అద్వైత బీజం వక్రతుండా కారంలోనే ఉంది. ఆధునిక ఋషులైన శాస్త్రవేత్తలు కనుగొన్న ఏకీకరణ జీవి కూడా వక్రతుండగానే ఉంది. 3 వంతుల జలంలో తేలియాడుతున్నట్లు ఉన్న ఒక్క భూభాగ నైసర్గిక ఆకారం కూడా వక్రతుండ గణపతిగానే గోచరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

యుగయుగాల నుండి ప్రధమంగా గాణపత్యులు గణపతిని ఆరాధించేవారు. ప్రతి కార్యంలోనూ తొలి పూజ గణపతికే కల్పించారు. నేటికీ ప్రపంచంలో ఏ మూల చూసినా గణపతి రూపం అనేక విధాలుగా కనిపిస్తుంది. ముఖ్యంగా గృహస్తులు ఈ సంసార సాగరాన్ని నిర్విఘ్నంగా దాటడానికి వెన్నంటి ఉండే అద్భుత దైవమే గణపతి. అందుకే ఆయన మొదట పసుపుతో చేసిన ఒక ముద్దగా మన పూజలో దర్శనమిస్తాడు. నిజానికి నిరాకార రూపుడు గణపతి పంచభూతాత్మకుడు.

విఘ్నేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల ప్రణయ మృత్తిక రూపమే గజాననుడు. భూమి, అగ్ని, ఆకాశము, అహంకారము, జలము, మనస్సు, బుద్ధి, వాయువు, సూర్యచంద్రులు, యజమాని అనగా విఘ్నారాధకుడు వరుసగా మృతికా పరిమళము పేదము కిరణశక్తి రసము సంకల్ప సిద్ధి విఘ్నేశ్వరుని యొక్క ఆకృతులే.

కార్యసిద్ధికి చేసే అవిఘ్న సంకల్పమే గణపతి రూపం. అందుకే గణపతిని మట్టితోనే తయారు చేయాలి. సాకారము నుండి నిరాకారానికి చేరాలి కనుకనే ఆ పవిత్రమైన మృత్తికతో మనం గణపతి ఆకారాన్ని నిర్మిస్తున్నాము. ప్రకృతిలో లభించే పత్రములు, ఫలములు, ఫలహారాలతో, భక్తి శ్రద్ధలతో నవరాత్రులనే నవవిధ భక్తి సోపాన భావముతో పూజించి మనం చేపట్టే లోక కళ్యాణ కార్యములకు సంసిద్ధులమగుచున్నాము.

ఆ సంకల్ప శక్తిని మనం ప్రోది చేసుకొని ఆ మృత్తికా రూపాన్ని అతి పవిత్రంగా తిరిగి జలంలో కలిపి వేస్తున్నాము. సాకార మూర్తి నిమజ్జనమై నిరాకార శక్తి మనలో ప్రవేశిస్తుంది. అందుకే మట్టి గణపతి మహా గణపతి ఇంకా ఎన్నో రహస్యాలు గణపతి చరిత్రలో మనకు గోచరం అవుతాయి. అయితే ఇక్కడ భక్తి, శ్రద్ధ, విశ్వాసం ప్రధానం. పవిత్రమైన మనసుతో ఆరాధన అవశ్యం. ఆడంబర విధానాలు ఆటంకాలు కలిగిస్తాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

Leave a Reply