న్యూ ఢిల్లీ – ఇజ్రాయెల్-ఇరాన్ (Israel – Iran ) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను (Indian Students ) తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ (Operation sindhu ) చేపట్టింది. ఇరాన్‌లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో (Urmia medical College ) చదువుతున్న 110 మంది విద్యార్థులను అర్మేనియా, దోహా (doha ) మీదుగా అధికారులు ప్రత్యేక విమానంలో (special Flight ) ఢిల్లీకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రి కేవీ సింగ్ వారికి స్వాగతం పలికారు. “ప్రయాణం చాలా కష్టంగా సాగింది. ముఖ్యంగా టెహ్రాన్‌లో అనేక దాడులు జరిగాయి. మేము ప్రయాణిస్తున్న బస్సుకు సమీపంలో ఒక క్షిపణి పడింది చాలా భయపడ్డాము” అని అలీ అనే విద్యార్థి తన అనుభవాన్ని పంచుకున్నాడు. సురక్షితంగా తరలించినందుకు భారత రాయబార కార్యాలయానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే, ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులు సరిగా లేవని, వాటిలో ప్రయాణించడం కష్టమని కాశ్మీర్‌కు చెందిన షేక్ అఫ్సా అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. మెరుగైన ఏర్పాట్లు చేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కోరినట్లు ఆమె తెలిపారు.
విద్యార్థుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో సమన్వయం చేసుకోవాలని రెసిడెంట్ కమిషనర్‌ను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలు త్వరగా ముగియాలని, తమ చదువులు దెబ్బతింటున్నాయని మరికొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.