friendly Police  : పల్లె ఒడిలో..చిత్తూరు పోలీసులు   Andhra prabha news

friendly Police  : పల్లె ఒడిలో..చిత్తూరు పోలీసులు   Andhra prabha news

జనంతో మాటామంతీ

నేరాల నివారణకు అవగాహన

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :

చిత్తూరు జిల్లాలో గ్రామీణ భద్రత, ప్రజల అవగాహన, పోలీసు ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) & ఇంచార్జ్ అడ్మిన్ ఎస్.ఆర్. రాజశేఖర రాజు నాయకత్వంలో ఈ కార్యక్రమం పూతలపట్టు మండలంలోని రంగంపేట గ్రామంలో ఘనంగా జరిగింది. పూతలపట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. గోపి ఆధ్వర్యంలో స్థానిక పోలీసు సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లో భద్రతపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం, పోలీసులతో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పడం, సమస్యలు నేరుగా వినిపించే వేదిక కల్పించడం వంటి ముఖ్య ఉద్దేశాలతో “పల్లెనిద్ర” నిర్వహించినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా “ధైర్య–స్పర్శ” అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. బాధితులు ఎదుర్కొనే పరిస్థితులు, పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, అత్యవసర సమయంలో పొందగల సహాయం వంటి అంశాలను స్పష్టంగా తెలియజేశారు.

సైబర్ నేరాల విషయంలో సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తత, మోసాలకు గురికాకుండా పాటించాల్సిన సూచనలను వివరించారు. అనుమానాస్పద లింకులు, కాల్స్, ఓటీపీలు పంచుకోవడం వంటి ప్రమాదకర అలవాట్లపై హెచ్చరికలు జారీ చేశారు.

యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక నష్టాలను ఉదాహరణలతో వివరించి, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన సమస్యలు, బాలికల ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, చట్టబద్ధమైన వయస్సు అనంతరమే వివాహం జరగాలని ప్రజలకు తెలియజేశారు.

రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.

గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేర నియంత్రణ, ఆధారాల సేకరణ సులభమవుతుందని, ప్రజల సహకారం పోలీసులకు అత్యవసరమని వివరించారు. పోలీసు–ప్రజల పరస్పర నమ్మకం ద్వారానే నేరరహిత సమాజం సాధ్యమని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు.

Leave a Reply