Former Minister | రైతు సమస్యలపై ప్రాణాలు పణంగా పెడతాం..
- మాజీ మంత్రి జోగు రామన్న
Former Minister | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సోయాబీన్ కొనుగోళ్ళు చేపట్టి, రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆదిలాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట కొనుగోళ్ల విషయంలో పూర్తిగా మొండి వైఖరి అవలంబిస్తూ దగా చేస్తున్నాయని మాజీమంత్రి జోగు రామన్న విమర్శించారు.
పత్తి కొనుగోళ్లలో కిసాన్ యాప్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతామని స్పష్టం చేశారు. సోయా కొనుగోళ్లలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. రైతులు మోసపోతుంటే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతాంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు. జిల్లా కలెక్టర్ కూడా మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో మార్క్ఫెడ్ 75% సోయా పంటను కొనుగోలు చేసి, కేంద్రంతో 20% పంట ధాన్యాన్ని కొనుగోలు చేయించామన్నారు.

రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ రైతుబంధు సకాలంలో వేసిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. కేంద్రం కేవలం రూ. 133 కోట్ల ఖర్చుతో రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనవచ్చని రామన్న అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 29మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం కనికరించడం లేదన్నారు.
రేపటి ఆదిలాబాద్ బంద్ ను విజయవంతం చేయండి.. జోగు రామన్న
సోయాబీన్ పంట కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు పోరుబాటలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ బంద్ పిలుపు ఇచ్చినట్టు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు పంట సరుకుతో పడిగాపులు కాస్తుంటే 1300 క్వింటాళ్ల సోయాబీన్ వెనక్కి తీసుకుపోవాలని రైతులపై ఒత్తిడి పెంచారని ఆరోపించారు.
కాగా రైతుల కోసం చేపట్టిన బంద్ కు అన్ని ప్రజా సంఘాలు, వర్తక వ్యాపారులు మద్దతు ఇవ్వాలని రామన్న కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజ్జగిరి నారాయణ, యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బాని, మారశెట్టి గోవర్ధన్ అడప తిరుపతి, బట్టు సతీష్, గణేష్ యాదవ్, దమ్మపాల్ కొండ, వాగ్మారె, ప్రశాంత్, రమేష్, జంగిలి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

