జన్నారం, జూన్ 5 (ఆంధ్రప్రభ) : ప్రోటోకాల్ వ్యవహారంలో మంచిర్యాల జిల్లా జన్నారం ఇన్చార్జి ఎఫ్డీఓ, జన్నారం ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ కు మెమో జారీ చేస్తూ, జన్నారం ఇన్చార్జి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తూ కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ నేడు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ వైల్డ్ లైఫ్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఎలూసింగ్ మేరు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ లో పర్యాటక కేంద్రాలను గుర్తించి అభివృద్ధి చేయాలని, తదితర అంశాలపై పరిశీలించడానికి ఈనెల 2న జన్నారం విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆ ముగ్గురు అటవీశాఖ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు జన్నారం రేంజ్ లోని జన్నారం ఇంచార్జి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి.శేషారాంనాయక్ ను సస్పెండ్ చేస్తూ, జన్నారం ఇంచార్జి ఎఫ్డీఓ, జిల్లా అటవీ అధికారి శివ ఆశీస్ సింగ్ కు, తాళ్ల పేట ఫారెస్ట్ రేంజు ఆఫీసర్, జన్నారం ఇన్చార్జి వి.సుష్మారావుకు మెమో జారీ చేస్తూ కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ ఆదేశాలను జారీ చేసినట్లు కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ, మంచిర్యాల సీఎఫ్ శాంతారాం గురువారం ఉదయం తెలిపారు. ఈ మేరకు ఆ ఆదేశాల ప్రతులను జన్నారం ఎఫ్డీఓ, రేంజ్ కార్యాలయానికి పంపినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర వైల్డ్ లైఫ్, విజిలెన్స్ పీసీసీఫ్ ఎలూసింగ్ మేరు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా, రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ సమీపాన అటవీ ప్రాంతంలో గుట్టపై ఉన్న గెస్ట్ హౌస్ లో భోజన, నీటి సౌకర్యం కల్పించడంలో ఆ ముగ్గురు అటవీ అధికారులు విఫలమయ్యారనే సమాచారం.
అందుకు ఆ పీసీసీఎఫ్ మనసులో మదనపడి విచారంతో మంచిర్యాల ఎఫ్డీపీటీ, కవ్వాల టైగర్ రిజర్వ్ సీఎఫ్ శాంతారాంకు, కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నెల రోజుల వ్యవధిలోని జన్నారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ లను, ఇన్చార్జి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి.శేషరాంనాయక్ ను సస్పెండ్ చేయడం పట్ల అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లలో ఆందోళన, గుబులు మొదలైంది. అటవీశాఖ అధికారుల తీరు పట్ల సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.