టైగర్ సెన్సెస్ కు అటవీ శాఖ రంగం సిద్ధం..

టైగర్ సెన్సెస్ కు అటవీ శాఖ రంగం సిద్ధం..

  • ప్రతి నాలుగేళ్లకోసారి చేపట్టే టైగర్ సెన్సెస్ కు అటవీ శాఖ రంగం సిద్ధం
  • ఈ డిసెంబర్ లోగా గణన పూర్తి చేసేందుకు అధికారుల సన్నద్దం
  • శాఖ సిబ్బందికి ‘ఫ్రీ ట్రెయినింగ్’ శిక్షణ తరగతులకు ఇటీవలే శ్రీకారం
  • ఎన్ సీటీఏ ఆదేశాలు వెలువడడమే తరువాయి గణనలో నిమగ్నం
  • ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉన్న ‘పులులు’ సంఖ్య ఎన్నో తేలే అవకాశం
  • పాదముద్రలు, సీసీ కెమెరాల ఫుటేజీయే కీలక ఆధారాలు

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ‘వామ్మో పులి..’! పులి పదం వింటేనే గుండెల్లో గుబులు, రైళ్లు పరుగెడుతాయి. అలాంటిది అటవీ శాఖ అధికారులు ఈ పులుల లెక్క తేల్చేందుకు సన్నద్దం అవుతోంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి అటవీ అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు.

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని పులులు సంచరిస్తున్నాయి..? వాటి కదలికలు ఎక్కడెక్కడ ఉన్నాయి..? అనే అంశాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. ఇందులో భాగంగానే నాలుగేళ్లకోసారి చేపట్టే పులుల గణన(టైగర్ సెన్సెస్)కు ఆ శాఖ కసరత్తు మొదలు పెట్టింది.

గణన పటిష్టంగా నిర్వహించడం కోసం సిబ్బందికి శిక్షణ తరగతులు(ఫ్రీ ట్రెయినింగ్) ఇటీవలే ప్రారంభించారు. టైగర్ జోన్ గా పేరొందిన జన్నారం వైల్డ్ లైఫ్ ఏరియాతో మొదలు దట్టమైన అడవుల్లో పాదముద్రలు, సీసీ కెమెరా(ట్రాప్)ల ఫుటేజ్ ఆధారంగా ఎన్ని పులులు ఉన్నాయనేది లెక్క తేల్చడానికి దాదాపు రంగం సిద్ధమైంది.

కేంద్ర పరిధిలోని నేషనల్ కన్సర్వేషన్ ఆఫ్ టైగర్ అథారిటీ(ఎన్ సీటీఏ) నుండి అనుమతులు రావడమే తరువాయి పులుల సంఖ్య ఎంతనేది తేలనున్న నేపథ్యంలో ‘ఆంధ్రప్రభ’ ప్రత్యేక కథనం…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల గణన చేపడుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ప్రీ ట్రెయినింగ్(ముందస్తు శిక్షణ తరగతులు) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఆర్ఓ, బీట్ ఆఫీసర్, ఇతర సిబ్బందిని శిక్షణ తరగతుల్లో భాగస్వామ్యం చేస్తున్నారు.

పులుల సంచారం ఎక్కడెక్కడ ఉంటుంది..? వాటి గణన సందర్భంగా ఏయే అంశాల్ని ప్రామాణికంగా తీసుకోవాలి..? అన్న దానిపై పూర్తి అవగాహన కల్పించడమే ఈ శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లా పరిధిలో గల గాంధారి వనం( బొక్కలగుట్ట)లో ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రధానంగా.. జన్నారం వైల్డ్ లైఫ్ ఏరియా, కాగజ్ నగర్ అటవీ డివిజన్ లో కడంబా అడవుల్లో పులుల గణన పటిష్టంగా చేపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో పులుల కదలికలు ఉన్న తరుణంలో ఇక్కడ ఎలా పులుల లెక్కింపు జరగాలి..? ఏయే ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలి..? అనే అంశాలను సిబ్బందికి కూలంకషంగా వివరిస్తున్నారు.

ఎన్ సీటీఏ అనుమతులే ఆలస్యం..!

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నాలుగు జిల్లాల్లో పులుల గణన లెక్క తేలాలంటే నేషనల్ కన్సర్వేషన్ ఆఫ్ టైగర్ అథారిటీ(ఎన్ టీసీఏ) అనుమతులు రావాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఈ శాఖయే అన్ని రాష్ట్రాలకు పులుల సంరక్షణ పర్యవేక్షిస్తుంది.

అదేవిధంగా పులుల సంరక్షణకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తుంది. కనుకనే ఎన్ టీసీఏ అనుమతి తప్పనిసరి. అప్పుడే అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో పులుల గణన మొదలవుతుంది. అప్పుడప్పుడు ‘మ్యాన్ ఈటర్’గా ఏదైనా పులి మారి హింసాత్మక ఘటనలకు పాల్పడితే తదుపరి చేపట్టే చర్యల గూర్చి కూడా ఈ అథారిటీ ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది.

ప్రధానమంత్రి ఆధీనంలో ఉండే ఈ అథారిటికి పులులు అంతరించిపోకుండ చూడడం.. వాటి సంరక్షణ బాధ్యతలు పర్యవేక్షించడం ప్రధాన కర్తవ్యం. ఈ నేపథ్యంలోనే ఎన్ టీసీఏ అనుమతుల కోసం అటవీ శాఖ అధికారులు వేచి చూస్తున్నారని తెలుస్తోంది. అప్పటి వరకు ఈ శిక్షణ తరగతులు పూర్తి చేసి.. గణనకు సంసిద్ధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వీటిని చేపట్టినట్లుగా స్పష్టం అవుతోంది.

పక్కాగా.. నిర్దేశిత సమయానుసారంగా..!

పులుల గణన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అప్రమత్తంగా ఉండి.. సమయానుసారంగా చేసే సాహసోపేత ప్రక్రియ. ఎన్ టీసీఏ నుండి అనుమతి వచ్చిందంటే పులుల గణనకు ఒక తేదీని ఖరారు చేసుకుంటారు. ఒకే రోజు ఒకే సమయాన్ని నిర్దేశించుకుంటారు.

రెండు లేదంటే మూడు గంటల వ్యవధిలో గణన ప్రక్రియ పూర్తి చేస్తారు. పులులు సంచరించే సమయం ఎప్పుడు.. ఎలా ఉంటుంది అనే అంచనాలను బట్టి జాగ్రత్తలు పాటిస్తూ లెక్కింపు చేపడతారని అటవీ అధికారుల సమాచారం. పక్కాగా.. పకడ్బందీగా చేపట్టే కార్యక్రమం కావడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ గణన నిర్వహిస్తారు.

అనంతరం గణన సమాచారాన్ని ఎన్ టీసీఏ అధికారులకు, కేంద్రానికి నివేదిస్తారు. మొత్తానికి చాలా జాగ్రత్తగా చేపట్టే గణన దరిమిలా సిబ్బంది పాటించాల్సిన చర్యలు, జాగ్రత్తలను ఈ శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పించడం జరిగిందని తెలుస్తోంది. అయితే అంతే ముందస్తుగా ఎన్ టీసీఏ ఆదేశాలు ఎప్పుడెప్పుడు వస్తాయో అప్పటికి తాము సిద్ధంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ శిక్షణ తరగతులు పూర్తి చేసినట్లు స్పష్టం అవుతోంది.

Leave a Reply