నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : దేవరకొండ మండలం ముదిగొండ (Mudigonda) గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food poisoning) తో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 310 మంది విద్యార్థులున్నారు. ఆదివారం రాత్రి విద్యార్థినులకు అల్పాహారంగా పెసర గుగ్గిళ్లను పెట్టారు. కొద్దిసేపటి తరువాత బగారా, చికెన్ తో భోజనం పెట్టారు. రాత్రి భోజనం తిన్న తర్వాత పాఠశాలలోని కొంతమంది బాలికలు కడుపునొప్పితో బాధపడుతూ విరేచనాలయ్యాయి.
సోమవారం ఉదయం అల్పాహారంగా పులిహోర వడ్డించారు. ఇది తిన్న అనంతరం 35మంది విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతుండడంతో ఆందోళన చెందిన టీచర్లు పాఠశాల ఏఎన్ఎం సాయంతో ముదిగొండ గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు చికిత్స నిమిత్తం పంపించారు. ఆయన సూచన మేరకు ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చేరిన బాలికలు
దేవరకొండ (Devarakonda) ప్రభుత్వ ఆస్పత్రిలో 13 మంది, తూర్పుపల్లి పీహెచ్‌సీ 22మందికి చేర్పించారు. ఈ రెండు ఆస్పత్రిలో వైద్య సేవలు పొందిన బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థినులు అస్వస్థత (Illness) కు గురైనట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న ఆర్డీఓ రమణారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బాలికలను పరామర్శించారు. అలాగే ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
డీటీడబ్ల్యూఓ ఎక్కడ?
గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగినా డీటీడబ్ల్యూఓ ఇంతవరకు రాలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం సంఘటన జరిగినా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ డీటీడబ్ల్యూఓ రాలేదని తెలిపారు.