ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ (vmc) ఆదివారం ఉదయం హరిత హారం పార్కు ( harita haram) కృష్ణా తీరంలో జరిగిన ఫ్లోర్ పెయింటింగ్, (floor painting) డ్రాయింగ్ పోటీల్లో ( drawing ) 300 మందికి పైగా యువత, చిన్నారులు పాల్గొని.. తమ కళా ప్రతిభను ప్రదర్శించారు.

స్వర్ణాంధ్ర విజన్ @ 2047, పీ4 (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం) విధానం, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్వచ్ఛంధ్ర, సేవ్ వాటర్, రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్, హరితాంధ్ర అంశాల్లో వేసిన వర్ణ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ చిత్ర కళా నైపుణ్యాన్ని వెలికితీసి ప్రజలను జాగ్రతృం చేసేలా వేసిన చిత్రాలు, కొత్త శోభను సంతరించుకున్న కృష్ణా తీరం స్ఫూర్తి వైబ్రెంట్ విజయవాడకు తొలి అడుగు అని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ (collector laksmisa) పేర్కొన్నారు.
పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో కనిపించిన ఉత్సాహంతో విజయవాడ గెలిచిందని.. ఈ విజయం అందించిన ఉత్సాహంతో ప్రతివారం హరిత బెరం పార్కులో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫొటోగ్రఫీ, యోగా, స్విమ్మింగ్.. ఇలా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామని.. వీటిలో నగర ప్రజలు, పర్యాటకులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

భవానీ ఐలాండ్‌లో బర్డ్స్ ఫొటోగ్రఫీ పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమేనని ఈ పోటీల్లో పాల్గొనడమే ప్రధానమని పేర్కొన్నారు. జిల్లాలోని పవిత్ర సంగమం, కొండపల్లి ఖిల్లా, గాంధీహిల్స్ తదితర పర్యాటక ప్రాంతాల్లోనూ వివిధ రకాల థీమ్స్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సెలవు రోజులను చిన్నారులు సద్వినియోగం చేసుకొనేలా వారిలో మంచి ఆలోచనలు వచ్చేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఈ మంచి ఆలోచనల ఆహ్లాదకర వాతావరణం స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయన్నారు.
*స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు గర్వకారణం….*
కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2024 పురస్కారాల్లో విజయవాడ నగరం సూపర్ స్వచ్ఛతా లీగ్ అవార్డును గెలుచుకున్నందుకు నగర ప్రజలకు, నగరపాలక సంస్థ అధికారులు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మాట్లాడుతూ చిన్నారులు, యువత పర్యావరణం, జల వనరులు, కాలుష్య దుష్పరిణామాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతివారం వివిధ రకాల ఇతివృత్తాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
విజయవాడకు సూపర్ స్వచ్ఛతా లీగ్ పురస్కారం లభించడానికి ప్రతిఒక్కరి కృషి కారణమని తెలిపారు…..
పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం:…
పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ, కమిషనర్ ధ్యానచంద్ర బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఫ్లోర్ పెయింటింగ్ విభాగంలో స్వర్ణాంధ్ర విజన్ _ సేవ్ వాటర్ పెయింటింగ్‌తో జి.తనూజ మొదటి స్థానంలో నిలిచి రూ. 10 వేల నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందుకుంది. ద్వితీయ బహుమతి (రూ. 7,500)ని పి.యామినీ విశాల, తృతీయ బహుమతి (రూ. 5,000)ను వి.జశ్వంతి, నాలుగో బహుమతి (రూ. 3,000)ని ఎం.సురేష్ పొందారు. ఫ్లోర్ పెయింటింగ్‌లో ఎల్.శ్వేత, పి.రచన, వి.అనురాధ, కె.హవీలా జెన్నీ, బి.రోహితలు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు.-
డ్రాయింగ్ పోటీల్లో ఎంఎస్ వైష్ణవ్య తొలి బహుమతి అందుకోగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో రాహిల్ జయాన్, జి.భాష్యశ్రీ , లక్ష్ జైన్ నిలిచారు. టి.క్రిష్, జి.ఇషికా కృష్ణన్, జి.ఆధ్వి, సాక్షం సుతార్, రామిరెడ్డి జశ్వితలు ప్రోత్సాహక బహుతులు అందుకున్నారు.
పోటీలకు కళానిపుణులు పి.చిదంబరేశ్వరరావు, కళాసాగర్, పి.రమేష్, సంతోష్ కుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డా. డి.చంద్రశేఖర్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ పి.కృష్ణచైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో తరుణ్ కాకాని, జిల్లా టూరిజం అధికారి ఎ.శిల్ప, ఆయుష్ అధికారి డా. రత్నప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.