భారీగా ఇన్ ఫ్లో !!

  • 39 గేట్లు ఎత్తివేత
  • 4.5 లక్షల క్యూసెక్కుల విడుదల

బాల్కొండ/మెండోర, ఆంధ్రప్రభ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2 లక్షల 85 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1084.80 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు.

వరద ఉద్ధృతి దృష్ట్యా, ప్రాజెక్టు 39 గేట్లను ఎత్తి గోదావరిలోకి 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఇతర మార్గాల ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం అవుట్ ఫ్లో 4,59,763 క్యూసెక్కులుగా ఉంది.

ఈ నీటి విడుదలతో గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన కోడిచర్ల, సావెల్ గ్రామాల మధ్య రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రాజెక్టులో ప్రస్తుతం 59.23 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గుత్పే, లక్ష్మీ,అలీ సాగర్ కాలువలకు నీటిని విడుదల చేయడం లేదు.

ఐఎఫ్ఎఫ్‌సీ ద్వారా 500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ 4000,సరస్వతి కాలువ 400, ఎస్కేప్ గేట్స్ ద్వారా 4000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 632 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది.

ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply