వరద పొంగుతోంది..

  • లంక గ్రామాల్లో కలెక్టరమ్మ హెచ్చరిక

గుంటూరు, ఆంధ్రప్రభ : “కృష్ణా నది వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. నదిని దాటేందుకు ప్రయత్నించడం.. దుస్తులు ఉతికడం వంటి పనులు చేయొద్దు” అని గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం, అన్నవరంపాలెం లంక గ్రామాలను సందర్శించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని తెలిపారు. నదిలో ఈతకు వెళ్లడం, దుస్తులు ఉతకడం వంటి పనులు చేయరాదని ప్రజలను హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఆమె పంటల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, వర్షాలు–వరదల వలన నీరు నిలువ లేకుండా చూడాలని సూచించారు.

అలాగే పారిశుధ్యం పాటించకపోతే వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అవసరం మేరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, ఇన్ ఛార్జ్ తహసిల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply