కరీంనగర్, ఆంధ్రప్రభ : గత పాలకులు మత్స్య శాఖను ఒక ఏటీఎంలా వాడుకున్నారని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) విమర్శించారు. సోమవారం కరీంనగర్ (Karimnagar) ఉజ్వల పార్కు సమీపంలో చేప పిల్లల పెంపకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… మత్స్య శాఖను గత ప్రభుత్వంలో ఏటీఎంలాగా వాడుకున్నారని, చేప పిల్లల పంపిణీలో మత్స్యకారులకు అన్యాయం చేశారన్నారు. గతంలో మత్స్య శాఖలో జరిగిన అవినీతి వల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తొలిసారి ముదిరాజ్ బిడ్డకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) మత్స్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. గతంలో వచ్చిన అవి నీతి మచ్చ తొలగించేలా ఇప్పటికే అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నానని, మత్స్య శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దేలా తనవంతు కృషి చేస్తున్నానని తెలిపారు. చేపలు ప్రకృతి ఇచ్చిన సంపద అని, మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లలు పంపిణీ చేస్తామన్నారు.
త్వరలోనే కేబినెట్లో చేప పిల్లలు పంపిణీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 87 కొ ట్ల చేప పిల్లలు పెంచేలా చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు ఉన్నాయన్నారు. కరీంనగర్లో చేపల ఉత్పత్తి మెరుగ్గా ఉందని, కరీంనగర్ పోరాటాల గడ్డ ఇక్కడి వారికి మంచి ఆలోచన వి ధానం ఉందన్నారు. ఇక్కడ చేప పిల్లల ఉత్పత్తి బాగుందని, మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పెరిగిన చేప రేటు వచ్చిన తర్వాత అమ్ముకునేలా కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రక్రియను కరీంనగర్ నుంచే ప్రారంభిస్తామన్నారు. మోపెడ్, బండ్లు చేపలు అమ్ముకునేలా ఉండేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామన్నారు.
ఈ ఏడాది 82 కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తామని, ముదిరాజ్ కార్పొరేషన్, ఫిషరీస్ కార్పొరేషన్ లు కూడా ఉన్నాయన్నారు. తెలంగాణ చేప ఉత్పత్తిలో నెంబర్ వన్ లా ఉండేలా కార్యచరణ తీసుకుంటామన్నారు. అలాగే జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామన్నారు. విద్యా ఉద్యోగాల్లో కాకుండా రాజకీయాల్లో కూడా బడుగులకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. కుల గణన చేసే ప్రక్రియలో బీసీ బిల్లు పెట్టే అవకాశం పొన్నంకి దొరికిందన్నారు. కుల గణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎంత అనేది శాస్త్రీయంగా తెలిసిందన్నారు.
మత్స్య సంపదను పెంచేలా కృషి.. మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణలో మత్స్య సంపదను పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. చేపల ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం జిల్లాలో లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు, ఎల్లంపల్లితోపాటు అనేక గొలుసుకట్టు చెరువుల నుండి చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున పెంచేలా చర్యలు తీసుకుంటుందన్నారు. గత పదేళ్లలో చేప పిల్లల పంపిణీ, కొనుగోలు, మత్స్య శాఖలో అవినీతి కారణంగా మొదటి సంవత్సరం చేప పిల్లల పంపిణీ కొంత ఆలస్యం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మత్స్య సంపద మీద వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ఇక్కడ నుండి అనేక ప్రాంతాలకు చేపలు ఎగుమతి జరుగుతుందని, మత్స్య సంపదకు కరీంనగర్ కేంద్రంగా ఉందని, మత్స్యకారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మీకు అండగా ఉంటామన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.