(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ జిల్లా) : భారీ వర్షాలతో కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చుతోంది. మున్నేరు (Munneru), పాలేరు పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణలోని వాగులు, వంకలు కట్టలు తెంచుకుని కృష్హమ్మ ఒడికి చేరుతుండగా.. వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. మంగళవారం ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నుంచి కేవలం లక్ష క్యూసెక్కుల నీరు విడుదల కాగా.. గురువారం అకస్మాత్తుగా వరద దూకుడు పెరిగింది.
ప్రకాశం బ్యారేజీకి 4,14,536 క్యూసెక్కుల నీరు చేరుకోగా బ్యారేజీ నీటి మట్టం 12.6 అడుగులకు చేరింది. ఇక కాలువలకు 8,540 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇందులో కృష్ణా తూర్పు మెయిన్ కెనాల్ (Krishna East Main Canal) నుంచి 4,528 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్ నుంచి 4,012 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇక 4,05,996 క్యూసెక్కుల మిగులు జలాలను 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేశారు. ఇక వరద పెరగటంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.