కొమ్మాల జాతరలో అగ్ని ప్రమాదం

కొమ్మాల జాతరలో అగ్ని ప్రమాదం
- ప్రమాదవశాత్తు బీఆర్ఎస్ ప్రభ బండికి అగ్ని ప్రమాదం
గీసుగొండ, ఆంధ్రప్రభ: వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల జాతర బీఆర్ఎస్ కి చెందిన ప్రభ బండి అగ్ని ప్రమాదానికి గురైంది. బాణాసంచా కాలుస్తున్న సమయంలో చెలరేగిన మంటలు ప్రభ బండిపై ఉన్న అలంకరణ సామగ్రికి అంటుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జాతర కోసం ప్రత్యేకంగా అలంకరించి తీసుకువచ్చిన ప్రభ బండి కొమ్మాల స్టేజ్ నుంచి ఊరేగింపుగా జాతర ప్రాంగణానికి చేరుకుంది.
ఈ సమయంలో అక్కడ బాణాసంచా కాలుస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పిన మంటలు ప్రభ బండిపై ఉన్న ఫ్లెక్సీలు, జెండాలు, లైటింగ్ వైర్లు, ఇతర అలంకరణ వస్తువులకు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రభ బండిపై అమర్చిన ఫర్నీచర్, జెండాలు, విద్యుత్ లైటింగ్ సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీంతో అక్కడ ఉన్న భక్తులు, స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు, నిర్వాహకులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు.
జాతరల్లో బాణాసంచా కాల్చేటప్పుడు నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని పేర్కొన్నారు.
