festival | ఆఫర్ల పేరుతో..

festival | ఆఫర్ల పేరుతో..

  • సైబర్ మోస‌గాళ్ల‌తో త‌స్మాత్ జాగ్ర‌త్త‌
  • సంక్రాంతికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్

festival | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో “భారీ డిస్కౌంట్లు”, “లిమిటెడ్ టైమ్ ఆఫర్”, “సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్” వంటి ఆకర్షణీయమైన ప్రకటనల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్నారని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం హెచ్చరించారు.

ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్ రీచార్జ్‌లు, ట్రావెల్ బుకింగ్‌లపై ఫేక్ షాపింగ్ ఆఫర్లు చూపిస్తూ నకిలీ వెబ్‌సైట్లు, నకిలీ యాప్‌ల ద్వారా ప్రజలను మభ్యపెట్టి డబ్బులు కొల్లగొడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపే ఫిషింగ్ లింకుల ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీలు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

కొన్ని సందర్భాల్లో చెల్లింపుల కోసం నకిలీ యాప్‌లు, నకిలీ క్యూఆర్ కోడ్‌లను ఉపయోగిస్తున్నారని, ముందుగా తక్కువ ధర చూపించి చెల్లింపు పూర్తయిన వెంటనే మోసగాళ్లు పూర్తిగా కనుమరుగవుతున్నారని వివరించారు. అలాగే ఆన్‌లైన్ లక్కీ డ్రా కూపన్లు, ఉచిత బహుమతుల పేరుతో పంపే లింకుల ద్వారా మొబైల్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేసి డేటాను దోపిడీ చేస్తున్నారని తెలిపారు. ఈ తరహా మోసాల వల్ల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు మాయం కావడం, సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ పలు సూచనలు చేశారు. తెలియని ఆఫర్ లింకులపై క్లిక్ చేయరాదని, అనధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా కొనుగోళ్లు చేయవద్దని సూచించారు. ఓటీపీలు, సీవీవీ నంబర్లు, బ్యాంక్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదన్నారు. అధికారిక షాపింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలని, సోషల్ మీడియాలో కనిపించే అతిగా తక్కువ ధరల ఆఫర్లను నమ్మొద్దని సూచించారు.

సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. సంక్రాంతి పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలంటే సైబర్ మోసాల పట్ల అప్రమత్తత అత్యవసరమని, “జాగ్రత్తే భద్రత” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

Leave a Reply