భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి..

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి..

దర్శి, ఆంధ్రప్రభ : రైతులు తమ పొలంలో భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వరప్రసాద్ తెలిపారు. స్థానిక ఎంపీడీవో మీటింగ్ హాల్ నందు ఐదు మండలాలలోని రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారుల, పశుసంవర్ధకశాఖ, ఉద్యాన వన శాఖల అధికారులచే ఆత్మ వారి సౌజన్యంతో కిసాన్ చర్చా గోష్టి కార్యక్రమం వ్యవసాయ సహాయ సంచాలకులు కె.బాలాజీ నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేల ఆరోగ్యం, పోషకాల యాజమాన్యం మీద రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో కేవీకె శాస్త్రవేత్త టి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రైతులు అవసరానికి మించి రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వలన నేలలన్నీ నిస్సారమైపోయి ఖర్చు పెరగడంతో పాటు దిగుబడులు కూడా తగ్గుతున్నాయని తెలిపారు. రైతు పంట వేసే ముందు భూమి ఆరోగ్యం గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలని తెలిపారు.

మండల వ్యవసాయ అధికారి కె.రాధ మాట్లాడుతూ.. రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంట ఒకే పొలంలో సాగు చేయడం వలన నేలలోని పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకోలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి రవి వెంకన్న బాబు, వెటర్నరీ డాక్టర్ దేవా నాయక్, నాగ భూషణం, కురిచేడు ఏఓ సంపత్ కుమార్, ముంద్లమూరు ఏవో తిరు మలరావు,మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.

Leave a Reply