Farmers | జూన్- ఆగస్టు మధ్య మండే ఎండలు

Farmers | జూన్- ఆగస్టు మధ్య మండే ఎండలు
ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది
జిల్లాల్లోనూ జర భద్రం
రైతులకు ఏఐ ఆగ్రోనమిస్ట్
ఇప్పటికి 5.45లక్షల మంది నమోదు
వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్
Farmers | (ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్) : రైతులకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ తీసుకొచ్చిందని, దీన్ని రైతులందరూ తప్పనిసరిగా ఉపయోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన వ్యవసాయరంగ ప్రగతి గురించి వివరించారు. ఏఐ ఆగ్రోనమిస్ట్ను ఇప్పటికే రాష్ట్రంలో 5.45 లక్షల మంది రైతులు నమోదు చేసుకుని, ఉపయోగిస్తున్నారని తెలిపారు. జిల్లాల్లో ఈ ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ గురించి రైతుల్లో అవగాహన కల్పించి ప్రతి రైతూ దీన్ని ఉపయోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులు ఈ యాప్ ద్వారా తాము వేసే పంటలకు సంబంధించి సలహాలు, సూచనలు, మార్కెట్ ధరలు, రైతులకు ప్రభుత్వం నుంచి అందే లబ్ది, పంటలకు సోకే తెగుళ్లు, పురుగుల గురించి ముందస్తు సమాచారం తెలుసుకునే వీలుంటుందని అన్నారు. ఆర్ ఎస్ కే అధికారులకు కూడా ఇదే తరహాలో ప్రత్యేక యాప్ను రూపొందించామన్నారు. రాష్ట్రంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాల్లో నిర్వహించే రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఈ యాప్ ఉపయోగాల గురించి రైతులకు అవగాహన కల్పించి రైతులంతా ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ను తప్పపకుండా ఉపకయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీకి ఎల్నినో ముప్పు
రాష్ట్రంలో ఎల్నినో తీవ్రత ప్రభావం ఈ సారి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. జూన్-ఆగస్టు మధ్య సాధారణ స్థాయిని మించి గరిష్టంగా ఎండలు కాసే సేచనలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు కూడా కనిపించే సూచనలున్నాయన్నారు. అయితే రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కొత్త కాదని, గతంలో 2015, 2016, 2018లోనూ వచ్చిందన్నారు. జులైలో తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎల్నినో తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధం అవుతోందని, జిల్లాల్లో కలెక్టర్లు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
