- నీటిని విడుదల చేసేందుకు వచ్చిన సీపీఎం నాయకులు..
- అడ్డుకున్న పోలీసులు
నంద్యాల బ్యూరో, జులై 4 (ఆంధ్రప్రభ) : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది.. శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు ఉధృతంగా వస్తుంది.. రాయలసీమ కు తలమానికమైన పోతిరెడ్డిపాడు (Pothireddypadu) హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని వదలాలని సీపీఎం నాయకులు హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని కిందకు విడుదల చేసేందుకు శుక్రవారం పోతిరెడ్డిపాడు వద్దకు వచ్చారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా (Jupadu Bungalow) మండలం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు సీపీఎం నాయకులు రైతులతో కలిసి పెద్దఎత్తున ప్రాజెక్టు దగ్గరకు వచ్చారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టారు. ధర్నాతో నిరసన వ్యక్తం చేశారు.
నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించిన సీపీఎం (CPM) నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సీపీఎం నాయకుల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలించారు. ఈసందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ… శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) నీటిమట్టం 854 అడుగులు దాటి 20 రోజులు గడిచినా ప్రభుత్వం మొదటి నుంచి నీటిని విడుదల చేయడం లేదని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, రైతులు పంటలు వేసుకునే నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
అధికారులను నీటిని విడుదల చేయాలని అడగగా, మరో వారం రోజుల నుండి విడుదల చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుకుందన్నారు. మొదటి నుంచి నీటి విడుదల చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాయలసీమ (Rayalaseema) పై నిర్లక్ష్య ధోరణి వహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, జిల్లా సహాయ కార్యదర్శులు రామచంద్రుడు, వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారాయుడు, వీరన్న, సురేష్, రామకృష్ణ, రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు, ఫకీర్ సాహెబ్, కర్ణ, శీను, రాము, బాలయ్య, కేవీపీఎస్ నాయకురాలు రంగమ్మ, ఈశ్వరమ్మ, సోమన్న పాల్గొన్నారు.
