blast| స్పాట్‌లో 15మంది డెడ్‌

blast| స్పాట్‌లో 15మంది డెడ్‌

నాగ్‌పూర్‌లో బాణాసంచా త‌యారీ కేంద్రంలో పేలుడు
డెటోనేటర్‌కు వైర్‌ను కలుపుతున్న సమయంలో ఘ‌ట‌న‌
కార్మికులను చుట్టుముట్టిన మంటలు
15 మంది మృతి, మరో 15 మందికి తీవ్ర గాయాలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. నాగపూర్ లోనీ కటోల్ ప్రాంతంలో బాణాసంచా తయారీ కేంద్రంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి భవనం మొత్తం కూలి పోయింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో డెటోనేటర్లను తయారు చేస్తున్నారు. డెటోనేటర్‌కు వైర్‌ను కలుపుతున్న సమయంలోనే ఈ పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 32 మంది కార్మికులు, ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నారు. పేలుడు జరిగిన వెంటనే క్షణాల్లో మంటలు కార్మికులను చుట్టుముట్టాయి. దాంతో వారు బయటకు వెళ్లే అవకాశం లేక, మంటల్లో కాలిపోయి కొందరు చనిపోగా, పొగ పీల్చి ఊపిరాడక మరికొందరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు శబ్దం చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుడు శబ్దంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫ్యాక్టరీ లోపల నుండి వస్తున్న పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తున్నాయి.

ఏం జరిగిందంటే..
నాగపూర్‌లో పేలుడు పదార్థాలు తయారు చేసే ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలో పేలుడు సంభవించింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించిన తరువాత అక్కడ మంటలు చెలరేగాయి. నాగపూర్ జిల్లాలోని కటోల్ తాలూకా, రౌల్‌గావ్ సమీపంలో గన్‌పౌడర్, డెటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలను తయారు చేసే కంపెనీలో ఈ పేలుడు సంభవించినట్లు నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, SBL కంపెనీలో ఆదివారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ఈ పేలుడు సంభవించింది.

ఈ పేలుడు ప్రమాదంలో సుమారు 15 మంది కార్మికులు మృతిచెందారు. మరికొందరు గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 18 మంది వరకు కార్మికులు గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్బీఎల్ ఎనర్జీ కంపెనీలో ఈ భారీ పేలుడు తర్వాత ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దీని తర్వాత ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

Leave a Reply