Exclusive | తెలంగాణలో ఇందిరా శక్తి ! ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం

కోటి మందిని కోటీశ్వరులుగా చేసేందుకు ప్లాన్​
పక్కా ప్రాణాళికలు రూపొందించిన ప్రభుత్వం
స్వయం సహాయక బృందాల్లో 65 లక్షల మంది
ఆ సంఖ్య కోటి మందికి చేర్చాలన్న సీఎం రేవంత్
మహిళల నేతృత్వంలో ఎలక్ట్రిక్​ బస్సులు
అద్దె ప్రాతిపదికన ఆర్టీసికి అప్పగించేందుకు చర్యలు
వచ్చే లాభాలన్నీ మహిళా సంఘాలకే అప్పగింత
సెర్ప్​, మెప్మా విభాగాలు ఒక్కటిగా చేసేందుకు ప్లాన్
కేరళ, కర్నాటక తరహాలో ప్రత్యేక శాఖ కిందకు
ప్రభుత్వ కార్యక్రమాల్లో పెరగనున్న మహిళల భాగస్వామ్యం
పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు సీఎం రేవంత్​ కృషి

హైదరాబాద్ , సెంట్రల్ డెస్క్ … తెలంగాణలో మహిళాభ్యుదయానికి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక పథకాలను తీసుకొస్తూనే వాటి అమలు కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం స్వయం సహాయక బృందాల్లో 65 లక్షల మంది ఉన్నారు. ఆ సంఖ్యను కోటి వరకు పెంచాలని సీఎం నిర్ణయించారు. దీంతోపాటు స్వయం సహాయక మహిళల అభివృద్ధికి ఇందిరా శక్తి పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాలికను రూపొందించారు. దీనిలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు బృహత్తర ప్రణాలికను రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికి గాను మహిళా సంఘాల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయించి తెలంగాణ ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వడం, ప్రతీ అసెంబ్లీ నియోజక పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, మహిళా సంఘాల ఆధ్వ‌ర్యంలో పెట్రోల్ బంకుల‌ను నిర్వహించడం తదితర అనేక విప్లవాత్మక పథ‌కాలను ప్ర‌జా ప్ర‌భుత్వం ప్రవేశపెడుతోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసి.. వారిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా కృషిచేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం.

సంఘటితంకానున్న రెండు విభాగాలు..

తెలంగాణలోని స్వయం సహాయక మహిళా బృందాలు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక నెట్వర్క్‌గా రూపొందాయి. గ్రామీణ స్థాయిలో స్వయం సహాయక బృందాల్లో 46.26 లక్షల మంది మహిళా సభ్యులుండగా, పట్టణ ప్రాంతాల్లో 17.88 లక్షల మంది ఉన్నారు. ఈ రెండింటిలో కలిపి మొత్తం 64.14 లక్షల మంది మహిళలున్నారు. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఆధ్య్వర్యంలో ప‌నిచేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) పరిధిలో పనిచేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2000లో సెర్ప్ ఏర్పాటు కాగా, 2007లో మెప్మా ఏర్పాటయింది. రాష్ట్రంలోని మొత్తం 32 గ్రామీణ జిల్లాల్లో 4 .37 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 46 .26 ల‌క్ష‌ల మంది మహిళలు సభ్యులుగా ఉండగా.. 18000 గ్రామైఖ్య సంఘాలు, 553 మండల సమాఖ్యలు, 32జిల్లా సమాఖ్యలున్నాయి. ఈ గ్రామీణ సంఘాలు ఇప్పటివరకు ₹ 4573 .50 కోట్ల కార్పస్ ఫండ్ కలిగి ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 17.88 మంది సభ్యులతో 1.77 బృందాలుండగా, 6468 వార్డ్ స్థాయిలో ఏరియా లెవల్ ఫెడరేషన్లు, 197 టౌన్ లెవల్ ఫెడరేషన్లు ఉన్నాయి.

నిరుపేదల ఉపాధికి చాన్స్​..

అయితే.. జాతీయ స్థాయిలో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడం, పటిష్ట పర్చడంలో తెలంగాణ సెర్ప్ అత్యంత కీలక పాత్ర వహిస్తోంది. తెలంగాణ మహిళలు జాతీయ స్థాయిలో ఎస్​హెచ్​జీల ఏర్పాటులో ప్రధాన రిసోర్స్ పర్సన్స్​గా వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక.. తెలంగాణ రాష్ట్రం 2016 -17 గణాంకాల ప్రకారం 42 శాతం అర్బనైజేషన్ కలిసి ఉంది. ఇది 2025 -26 నాటికి 50 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన పట్టణీకరణ నేపథ్యంలో 33,914 మహిళా సంఘాలు, 1303 గ్రామైక్య సంఘాలు అర్బన్ ఎస్​హెచ్​జీలుగా మారాయి. గ్రామీణ సంఘాల మహిళల ఉత్పత్తులకు పట్టణ మహిళా సంఘాలు మంచి మార్కెటింగ్ కల్పించనున్నాయి. రాష్ట్రంలోని నిరుపేద మహిళలందరిని స్వయం సహాయక బృందాల పరిధిలోకి చేర్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

4వేల మంది సుశిక్షుతులు..

కాగా, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలుప్రత్యేకంగా సెర్ప్ క్రింద పనిచేస్తుండగా, పట్టణ ప్రాంతాల మహిళా సంఘాలు మెప్మా కిద పనిచేస్తున్నాయి. అయితే.. కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో మహిళా సంఘాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక శాఖ ఉంది. అక్కడ మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. తెలంగాణలోనూ సెర్ప్ , మెప్మాలను విలీనం చేసి ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి స్వయం సహాయక మహిళా బృందాల సేవలను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే, సెర్ప్ ఆధ్వర్యంలో దాదాపు 4000 మంది సురక్షితులైన మహిళలున్నారు. వీరి సేవలను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోనున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలతో కలసి ఈ మహిళా సంఘాలు పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే, మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయిస్తున్నారు.

దేశానికే దిక్సూచిగా తెలంగాణ మహిళలు..

ఎలక్ట్రిక్ బస్సులను మహిళా సంఘాల నుంచి కొనుగోలు చేయించి వాటిని తెలంగాణ ఆర్టీసీ ద్వారా నడిపించే ప్రణాళిక కూడా జరిగింది. ఇప్పటికే హైదరాబాద్​లోని శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి ఇందిరా బజార్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో సహా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో మహిళా సంఘాలతో ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్రంలోని స్వయంసహాయక బృందాలకు చెందిన ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేయడానికి రూపొందిస్తున్న ప్రభుత్వ చర్యలు త్వరలోనే విజయవంతమై మహిళాభ్యుదయంలో దేశానికే తెలంగాణా ఒక దిక్సూచిగా నిలువనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *