Exclusive | ఎర‌తో గురి! అడ్డంగా దొరికిన పాక్‌

హెచ్‌క్యూ9 గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణలో పాక్ సుర‌క్షితం
పాకిస్తాన్‌లోకి ఆత్మాహుతి డ్రోన్లు పంపిన భార‌త్‌
ఫైటర్ జెట్లుగా భావించి డిఫెన్స్ సిస్ట‌మ్స్ ఆన్‌లోకి
వెంట‌నే యాక్టివేట్ అయిన రాడార్ వ్య‌వ‌స్థ‌లు
టార్గెట్‌పైకి దూసుకెళ్లిన బ్ర‌హ్మోస్ క్షిప‌ణులు
ఒక్క దెబ్బ‌తో పాక్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ధ్వంసం
తొలుత డ్రోన్ల‌తో పాక్ నాగోర్‌-ఖారాబాఖ్ ఎత్తులు
చిత్తుచేసిన భార‌త ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్‌
ఆ త‌ర్వాత కాళ్ల‌బేరానికి వ‌చ్చిన పాక్ స‌ర్కారు
సంధికోరుతూ అమెరికాతో బేర‌సారాలు

ఉగ్ర‌వాదుల‌కు ర‌క్ష‌ణ‌గా మారి.. వారిని నిరంత‌రం భార‌త్‌పైకి ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌ను చావుదెబ్బ తీయాలని భారత్ నిర్ణ‌యించింది. దీంతో మే 10వ తేదీన ఓ ఎరను పాక్ మీద‌కు విసిరింది. అనుకున్నట్టే ఆత్రంగా స్పందించిన ఇస్లామాబాద్ ఆ స‌మ‌యంలో భారత్‌కు అడ్డంగా దొరికిపోయి చావు దెబ్బతింది. చైనా విమానాలు.. తుర్కియే డ్రోన్లు అంటూ మీడియా ముందు గంభీర ప్రకటనలు చేసిన పాక్.. ఈ దెబ్బ‌తో కాళ్లబేరానికి వచ్చింది. అత్యంత నాటకీయంగా జరిగిన ఈ పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

= సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

మే 9-10వ తేదీ రాత్రివేళల్లో భారత్‌లోని పౌర నివాసాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొన్న పాక్.. డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసింది. దీంతో ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు అనుకొన్న భారత్ పాక్ కీలక స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. అయితే.. హెచ్ క్యూ 9 గగనతల రక్షణ వ్యవస్థ (ఎన్-300కు చైనా వెర్షన్) అడ్డంగా మారిందని గుర్తించి. వెంటనే.. డికాయ్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. వాయుసేన ఫైటర్ జెట్లను తలపించేలా సంకేతాలు పంపే కొన్ని రకాల డ్రోన్లను గాల్లోకి వదిలింది. ఇంకేముంది.. భారత ఫైటర్ జెట్లు దొరికాయ‌నుకుని పాక్ హెచ్ క్యూ 9 గగనతల రక్షణ వ్యవస్థ సహా ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. దీంతో అవి మోహరించిన ప్రదేశాలను గుర్తించిన భారత్.. హరూప్ తరహా ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగిం గించి రాడార్ వ్యవస్థని దెబ్బతీసింది.

విజృంభించిన‌ బ్ర‌హ్మోస్ క్షిప‌ణులు..

ఈ క్ర‌మంలో భారత్ పశ్చిమ నైరుతీ కమాండ్ల నుంచి ఫైటర్ జెట్లు బ్రహ్మోస్, స్కాట్స్, క్రిస్టల్ మేట్, ర్యాపేట్ వంటి ఆయుధాలను బార‌త్‌ ప్రయోగించింది. ఇవి నిరాటంకంగా పాక్ వైమానిక దళ స్థావరాల పైకి దూసుకెళ్లాయి. వీటిల్లో బలమైన షెల్టర్లు, ర‌న్‌వేలు, కమాండ్ సెంటర్లను దెబ్బతీసే పనిని బ్రహ్మోస్ చూసుకొందని ఓ ఆంగ్ల వార్తా సంస్థ త‌న కథనంలో పేర్కొంది. ఈ దాడి తర్వాత పాక్ తమ యుద్ధ విమానాలను సుదూరంలోని ఎయిర్ బేస్‌ల‌కు మార్చేసింది. ఈ దాడికి సుమారు 15 బ్రహ్మోస్ క్షిపణులు వాడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పాక్‌కు ఉన్న 12 అత్యంత కీల‌క ఎయిర్ బేస్‌ల‌లో 11ను భారత్ దెబ్బతీసింది.

క్రిస్టల్ మేజ్- ర్యాంపేజ్ అంటే ఏమిటి?

ఇది ఇజ్రాయెల్‌కు చెందిన గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణి. క్రిస్టల్ మేజ్ ర్యాంపేజ్ (కార్డ్) రకాలను భారత్ వాడుతోంది. ఈ ఆపరేషన్‌లో దేన్ని వినియోగించిందో కచ్చితంగా తెలియదు. వీటి రేంజి మాత్రం 100-250 కిలోమీటర్ల మ‌ధ్య‌లో ఉంటుంది. 1,000 కిలోల బరువు ఉండటంతోపాటు.. 80 కిలోల పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలదు. సుఖోయ్ వంటి యుద్ధ విమానాలు వీటిని ప్రయోగించగలవు. క‌దిలే లక్ష్యాలను కూడా ఇవి క‌చ్ఛిత‌త్వంతో ధ్వంసం చేయగలవు.

ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు..

ఇక ర్యాంపేజ్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ తయారుచేసింది. ఇది సూపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టూ గ్రౌండ్ మిసైల్.. హైవాల్యూ టార్గెట్లను ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. సుఖోయ్-30, మిగ్‌-29లు వీటిని ప్రయోగించగలవు. రక్షణ శాఖ ఇచ్చిన ప్రత్యేక అధికారాలతో వీటిని గతేడాది కొనుగోలు చేశారు. ఇవి స్పైస్ 2000 బాంబుల కంటే ఎక్కువ రేంజిని ఇవ్వగలవు. వీటిని కూడా దేశీయంగా ఉత్పత్తి చేయాలని వాయుసేన భావిస్తోంది.

నాగోర్నో-కారోబాఖ్ ఎత్తులు పారలేదు..

నాగోర్నో-కారోబాఖ్‌ యుద్ధ సమయంలో అజ‌ర్ బైజాన్ కూడా సోవియట్ కాలం నాటి ఏఎన్ -12 యుద్ధ విమానాలను డ్రోన్లుగా మార్చి.. అర్మేనియాపై ప్రయోగించింది. దాని ఎయిర్ డిఫెన్స్‌లు వాటిని కూల్చాయి. ఈ సమయంలో అజ‌ర్ బైజాన్ దళాలు ఆ గగనతల రక్షణ వ్యవస్థ స్థావరాలను గుర్తించి వాటిపై దాడి చేశాయి. దీంతో ఆర్మేనియా గగనతలానికి రక్షణ లేకుండా పోయింది. అనంతరం అజ‌ర్ బైజాన్ డ్రోన్లు విబృంభించి విజయం సాధించాయి. దీనికి తుర్కియే వ్యూహరచన చేసింది. తాజాగా భారత్‌పై అలా చేద్దామని పాక్ చూసింది. మే 6-7 తేదీల్లో భారత్ పైకి వందల కొద్దీ తుర్కియే డ్రోన్లు పంపి ఎయిర్ డిఫెన్స్‌ల‌ను గుర్తించేందుకు యత్నించింది. కానీ, మన వ్యవస్థలు వాటిని కుప్పకూల్చి పాక్ వ్యూహాన్ని చిత్తు చేశాయి. కానీ, 30వ తేదీన భారత్ అలాంటి వ్యూహంతోనే పాక్‌కు డ్రోన్లను పంపి.. దాని గగనతల రక్షణ వ్యవస్థను కూల్చడం విశేషం.

కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్‌..

ఎయిర్ డిఫెన్స్‌తో స‌హా వ‌రుస‌గా విరుచుకుప‌డుతున్న భార‌త సైన్యం దెబ్బ‌కు పాకిస్తాన్‌కు ఏం చేయాలో దిక్కుతోచ‌లేదు. స్వ‌యంగా ఆ దేశ ప్ర‌ధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్‌ను బంక‌ర్ల‌లోకి త‌ర‌లించింది సైన్యం. ఈ క్ర‌మంలో ఇక చాలించండి మ‌హా ప్ర‌భో అంటూ భార‌త్‌తో కాళ్ల‌బేరానికి వ‌చ్చింది. అమెరికాతో సంధి బేరాలు కుదుర్చాల‌ని ప్రాథేయ‌ప‌డింది. ఈ క్ర‌మంలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధ విర‌మ‌ణ కోరుతూ ఇరు దేశాల‌తో సంప్ర‌దింపులు చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఇక మీద‌ట‌ జిత్తుల‌మారి ఎత్తులు వేస్తే పాక్ అంతు చూస్తామ‌ని భార‌త సైన్యం తీవ్ర హెచ్చ‌రిక‌లు పంపిన‌ట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *