పొలిటికల్ నేషనల్ గేమ్ షురూ
టార్గెట్ ఫిక్స్ చేసిన బీజేపీ హైకమాండ్
తదుపరి గురి అంతా బెంగాల్ దీదీ పైనే
బీహార్‌ను వదిలేది లేదంటున్న కమలనాథులు
ఇటు డీఎంకే, అటు బీఆర్ఎస్‌కూ టెండర్
వేగంగా పావులు కదుపుతున్న కాషాయ దళం
దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యం
నార్త్ ఇండియా పార్టీ అనే ముద్ర చెరిపేసుకునే యత్నాలు
ఇదే కమలనాథుల కామన్ హిడెన్ అజెండా
ఢిల్లీ గెలుపు.. కమలనాథులకు భారీ బూస్టింగ్
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్ – ఢిల్లీలో బీజేపీ గెలిచింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడింది. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. బీజేపీకి ఈ విజయం లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగమా? ప్రాంతీయ పార్టీలతో నేషనల్ గేమ్ ఆడుతోందా? ఢిల్లీలో ఆప్ ఓటమి అనంతరం రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఆప్ ఓటమి మరో నాలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను బీజేపీ గండం పీడిస్తోంది. తమను వ్యతిరేకించే ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని ధ్వంసం చేయటమే వ్యూహంగా బీజేపీ ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. తమను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల వేళ్లను తెగనరకటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించిన తర్వాత ఈ వాదన మరింత బలపడింది. ఇప్పటికీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల సంస్కృతిని క్రమక్రమంగా తొలగిస్తూ పోతే కాంగ్రెస్ వంటి జాతీయ ప్రత్యర్థి పక్షంతో పొలిటికల్ గేమ్ సులభమమని బీజేపీ ఆలోచిస్తోంది. అవును నిజమే.. మహారాష్ట్రలో శివసేన, బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడి, ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ పార్టీల పరిస్థితే ఇందుకు ఓ ఉదాహరణ. అంతెందుకు.. మొన్నటికి మొన్న ఏపీలో వైసీపీని, నిన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని కుదేలు చేయటంలో బీజేపి ఇదే వ్యూహాన్ని అమలు చేసింది.
ఓన్లీ నేషనల్ పార్టీస్!
రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాషాయం జెండా ఎగరవేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఆ పార్టీ నాయకులు కొందరు ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతూ ఉంటారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపి తన ఉనికి లేని రాష్ట్రాల్లో కూడా బలాన్ని పెంచుకునేందుకు యత్నాలు ప్రారంభించింది. ప్లాన్ ఏ ప్రకారం సామంత బాధ్యత వహించే ప్రాంతీయ పార్టీతో జత కట్టటం. ఆ పార్టీ లీడర్ ఎదురు తిరిగితే మరో సామంత పార్టీతో పొత్తుపెట్టుకోవటం ప్లాన్ బీలో భాగంగా ఉంటోంది. ఎవరితో పని లేదు.. ఇక ప్లాన్ సీ ప్రకారం ప్రాంతీయ పార్టీలన్నింటినీ కుంగదీసి ఏకచత్రాధిపత్యం చెలాయించాలి. ఇదీ మిత్ర లాభ బేధ వ్యూహం. ఈ మూడింటిలో ప్లాన్ సీ సక్సెస్ అయితే బీజేపి నేరుగా అధికారంలోకి వస్తుంది. లేదో ప్లాన్ ఏ, బీ తప్పని సరిగా ఆప్షన్స్‌లో ఉంటాయి. ఏదేమైనా ప్రాంతీయ పార్టీ పాలించే రాష్ట్రంలోని ఫీఠాన్ని కైవసం చేసుకోవటం ఖాయం. ఇదీ బీజేపి అంతర్గత కామన్ హిడెన్ ఎజెండా.
జగన్‌తో అంటకాగుతూనే.. బాబుతో మైత్రి
ఆంధ్రప్రదేశ్‌ను గమనిస్తే.. ఇక్కడ అధికారంలోని ప్రాంతీయ పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేనతో బీజేపీ చేతులు కలిపింది. 151 స్థానాలతో సంక్షేమం వ్యూహంతో జనానికి నవరత్నాల పేరిట లక్షలాది రూపాయలు వెదజల్లిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కని స్థితిని బీజేపీ రచించింది. పార్లమెంటులో తిరుగులేని మద్దతు ప్రకటించినా.. అప్పటి సీఎం అహంకారాన్ని బీజేపీ తట్టుకోలేక పోయింది. స్వతంత్ర రాజ్యాన్ని సహించలేక పోయింది. ఏది ఏమైతేనేం.. అసలు ఉనికే లేని ఏపీలో.. బీజేపీ అధికార కూటమి పాలిస్తోంది. ఇక్కడ బీజేపీ నీడలో రెండు ప్రాంతీయ పార్టీలు పాలన సాగిస్తున్నాయనేది రాజకీయ పండితుల విశ్లేషణ.
ఇక చలో బీహార్..
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ సక్సెస్‌ఫుల్‌గా ఇంటికి పంపించింది. ఇప్పుడు బీజేపీ ముందున్న తక్షణ లక్ష్యం చలో బీహార్. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ భాగస్వామి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తూ నితీష్ దగ్గరి బంధువయ్యాడు. కానీ ఇక్కడే మహా ట్విస్ట్ ఉంది.. ఆయన ఏం కోరితే అదే చేయాలి. లేకపోతే తూచ్ అంటూ పార్లమెంటులో పేచీకి దిగటం ఆయన నైజం. ఈ అయిదేళ్లల్లో ఎన్డీయేలో ఎన్నాళ్లు ఉంటాడో.. ఊడతాడో బీజేపీకి తెలీదు. ఇలాంటి అనూహ్య పరిణమాలు చోటు చేసుకున్నప్పుడల్లా.. నితీశ్ ఎదుట ప్రణమిల్లి ప్రణామాలతో ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటానికి ఆపద్ధర్మ మిత్రలాభాన్ని పాటించినా.. ఎక్కువ సీట్లలో గెలిచి మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీ బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహరచనగా తెలుస్తోంది.
డేంజర్ జోన్‌లో ఆ నలుగురు..
బీహార్ తర్వాత వాట్ నెక్ట్స్ అంటే… పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎప్పటికప్పుడు బీజేపి పట్టు పెంచుకుంటూ వస్తోంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో 2011 నుంచి దీదీ మమతా బెనర్జీ హవా నడుస్తోంది. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కేవలం మూడు స్థానాలకే పరిమితమైన బీజేపి 2021 నాటికి 77 స్థానాలకు ఎదిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకుంటామని చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ఓటమి బీజేపికి భారీ బూస్టింగ్ కానుంది. కోల్‌కతాలో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటన తర్వాత మమతా సర్కారుపై వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని ఉపయోగించుకుని రాజకీయంగా ఎదగాలని బీజేపీ చూస్తోంది. మొత్తానికి తమదే నెక్ట్స్ రూలింగ్ పార్టీ అని పశ్చిమ బెంగాల్ బీజేపి చీఫ్ సువేందు అధికారి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక దక్షిణాదిపైనే నజర్..
సౌత్ విషయానికి వస్తే.. ఏపీలో ఎన్డీఏయేదే అధికారం. తెలంగాణలో పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చే ఎన్నికల నాటికి వ్యతిరేకత మొదలైతే దాన్ని తమకు అనువుగా మలచుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే, తెలంగాణ అసెంబ్లీలోనూ, పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీ బలం చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. ప్రస్తుతానికి ఆ పార్టీ వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కేరళ, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. అక్కడ తన ఖాతా ఎలాగైనా తెరవాలనే పట్టుదలతో వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో కనుక వచ్చే ఏడాది తన ఉనికిని చాటుకోగలిగితే.. అది నార్త్ ఇండియా పార్టీ అనే ముద్ర నుంచి పూర్తిగా బయటపడినట్లవుతుంది. ఈ పవర్ గేమ్‌లో బీజేపీ దూకుడుకు ప్రాంతీయ పార్టీలే కళ్లెం వేస్తున్నాయి. ఆ హర్డిల్ దాటే ప్రయత్నంలో డిల్లీ గెలుపు బీజేపీకి ఒక తిరుగులేని సంకేతంగా మారింది.