ఉపనిషత్తులు భగవంతుని ఉనికితో ముడిపడి, ఆయన గురించి లోతుగా విశ్లేషించుకోవాలి అనుకునే వారికి ఒక మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. సర్వవేదాల సారం ఉపనిషత్తులలో నిబిడీకృతమై ఉంటుంది. భగవంతుడు సర్వవ్యాపి. ఆయన ఏ ఒక్క లింగానికి చెందినవాడు కాదు. అన్ని లింగాల వాడు. ఇదే ఉపనిషత్తుల ప్రధాన సారాంశం.
ఉపనిషత్తులలో అతి ప్రధానమైన ‘ఈశోపనిషతు’ సారాంశం ప్రకారం ఆ భగవంతుడు వేర్వేరు దిక్కుల నుండి చూడబడి వివిధ రూపాలలో కనిపిస్తాడు. ఆయన అచలుడు. మనస్సుకంటే వేగము కలిగి, అన్నింటా ఉంటాడు. ‘కఠోపనిషత్తు’ ప్రకారం ఆ దేవదేవుడు శాశ్వతుడే కాక, నిత్యుడు కూడాను.
అలాగే, ఆ భగవంతుని ఆజ్ఞ లేనిదే దేవతలు గడ్డి పరకనైనా కదిలించలేరని ‘కేశోపనిషత్తు’ తెలుపుతోంది. ప్రశ్నకు జవాబు ఇచ్చిన తీరుగా, ఆయన ఉత్తమ జీవితం కంటే శ్రేష్టుడని, జ్యోతులకే జ్యోతి అని ‘ప్రశ్నోపనిషతు’ స్పష్టంగా నుడివింది. ఆ పరమాత్మ అణు రేణువుల కంటే సూక్ష్మమైన వాడని, అసలు తర్కానికే అందని వాడని ‘కఠోపనిషత్తు’ ద్వారా వెల్లడి అవుతోంది. ‘ముండకోపనిషత్తు’ ద్వారా మనకు అవగతం అయేదేమిటంటే ఆ భగవంతుడు అక్షరుడని, అదశ్రుడనీను!
భక్తులు అలసిన వేళ సేదతీర్చే అంతర్యామిగా, స్థూల భోగిగా ఆ సర్వాంతర్యామిని గురించి ‘మాండూక్యోపనిషత్తు’ వివరించింది. అంతేకాకుండా, అతను అమృతుడనీ, వేదరాశి కోశుడనీ ‘తైత్తిరీయోపనిషత్తు’ తేటతెల్లం చేసింది. నిస్సందేహంగా, భగవంతుడు సర్వవ్యాపినే కాకుండా, స్వయం ప్రకాశ గుణం కలవాడని ‘ఐతరేయోపనిషత్తు’ వెల్లడిస్తోంది.
‘ఛాందోగ్యోపనిషత్తు’ ప్రకారం ఆ భగవంతుడు అన్ని పాపములకు పైనున్నవాడు కనుక, దేవతలను శాసించే అధికారం ఆయనకే ఉన్నదని తెలుస్తోంది. భగవంతుడు తేజస్వి అనీ, భక్తులను ఎన్నడూ వీడడని ‘బృహధారణ్యోపనిషత్తు’ తెలిపింది.
ఇలా, భారతీయ జన జీవితాన్ని ఔపోషణ పట్టేలా రూపొందించిన ఉపనిషత్తులలో ఇంకా అనేక ఆదేశాలు, సందేహాలు నిబిడీకృతమై ఉన్నాయి. ఉపనిషత్తుల సారాన్ని సారాంశంగా తెలుసుకుంటే ఆ భగవంతుడి గురించి సర్వం తెలిసినట్లే!
- పంతంగి శ్రీనివాసరావు