శ్రీనగర్ – పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్ట్ కోసం వేట ప్రారంభించిన భద్రతా దళాలు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి.. చివరి నిమిషంలో అప్రమత్తం కావడంతో 60 మంది ఆర్మీ సిబ్బంది సురక్షింతంగా బయటపడ్డారు. కాగా ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని పట్టుకుందుకు భద్రతా దళాలు తనను వెతుక్కుంటూ ఇంటికి వస్తారని అంచనా వేసిన పహల్గాం దాడి ఉగ్రవాది ఆసీఫ్ ఫౌజీ ఇంట్లో ఐఈడీలు పెట్టి భద్రతా దళాలకు వారికి ట్రాప్ పెట్టాడు. అయితే త్రుటిలో ఆ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకోగలిగారు. ఇలాగే మరో ఉగ్రవాది ఇంట్లోనూ జరగడం గమనార్హం.
దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఉగ్రవాదుల ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్ , ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి ఇళ్లల్లో సోదాలు జరపడానికి జమ్మూకశ్మీర్ పోలీసులు వెళ్లారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. క్షణాలలో అక్కడే ఉన్న ఆరవై మందికి పైగా ఉన్న భద్రతా సిబ్బంది స్పందించి ఆ ఇళ్ల నుంచి, పరిసరాల నుంచి అత్యంతవేగంగా దూరంగా వెళ్లిపోయారు. వారి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి.
గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లల్లో పేలుడు పదార్థాలు అమర్చి.. ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని ఓ పోలీసు అధికారి మీడియా వద్ద అనుమానం వ్యక్తం చేశారు.
2018లో అదిల్ చట్టబద్ధంగా పాకిస్థాన్ వెళ్లి, గతేడాది జమ్మూకశ్మీర్‌కు తిరిగి వచ్చాడని.. ఇన్నాళ్లు అక్కడ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందాడని అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్‌నేమ్‌లు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఆదిల్ థోకర్ అనే మరో ఉగ్రవాదికి కూడా వీరితో సంబంధం ఉందని తెలిపింది. వీరందరూ జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఊహా చిత్రాలను గీశారు. టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి వారి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో బాధితులు వారి ముఖాలను చూశారు. ఈ ఫొటోల ఆధారంగా వీరి కోసం భద్రతా సిబ్బంది వేట మొదలుపెట్టారు.