Encounter – రేవంత్ రెడ్డికి ఎపి మంత్రి స‌త్య‌కుమార్ మాస్ కౌంట‌ర్

విజ‌యవాడ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీని రేవంత్ రెడ్డి గాడ్సేతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. విశ్వనాయకుడు అయిన ప్రధాని నరేంద్ర మోడీని గాడ్సేతో పోల్చడం.. రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమేనని విమర్శలు గుప్పించారు. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తలలో నిలిచి, ప్రజల దృష్టిని తన వైఫల్యాల నుంచి మరల్చడం తెలంగాణ సీఎంకు అలవాటేనని ఆరోపించారు.

విజ‌య‌వాడ‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, తన పదవీకాలాన్ని పెంచుకోవడం కోసం స్థాయికి మించి విమర్శలు చేయడం పొరపాటని అన్నారు. బీజేపీని అడ్డుకోవడం, నెహ్రూ, ఇందిర, సోనియా, రాహుల్, వల్లే కాలేదని.. ఆ కుటుంబం మోచేతి నీళ్లు తాగే రేవంత్ లాంటి పిపీలికం వల్ల ఏమవుతుంది? అని ట్వీట్ చేశారు

రేవంత్ ఏమన్నారంటే.. ?

అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీపై, ప్రధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని అన్నారు. దేశాన్ని విభజించాలని చూస్తున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా, గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వబోమని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ వాళ్లను దేశం నుంచి తరిమేసినట్లే బీజేపీని తరిమేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *