కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు

కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు

రంగంలోకి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్
అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది
డిఎస్పితో పాటు తనిఖీలు చేసిన సీఐలు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా కోర్టును మరోసారి బాంబు బెదిరింపు కలవరపరిచింది. ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో జిల్లా జడ్జి అరుణ సారికకు ఒక బెదిరింపు ఈమెయిల్ అందడంతో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన న్యాయసంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు భారీగా మోహరించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ మహేశ్వర, టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు.

కోర్టు పరిసరాలను పూర్తిగా ఖాళీ చేయిస్తూ, లోపల ఉన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కేసులతో వచ్చిన ప్రజలను బయటికి పంపించారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండాz కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తదుపరి డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బందిని రంగంలోకి దించి కోర్టు భవనంలోని ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బెదిరింపు ఈమెయిల్‌లో కోర్టు ప్రాంగణంలోని 25 చోట్ల గ్రానైట్ బాంబులు అమర్చినట్టు పేర్కొనడం కలవరాన్ని మరింత పెంచింది.

ఎప్పుడైనా పేలే అవకాశం ఉందని హెచ్చరికలు ఇవ్వడంతో పోలీసులు అత్యంత అప్రమత్తంగా తనిఖీలు చేపట్టారు. అయితే విస్తృతంగా నిర్వహించిన తనిఖీల అనంతరం ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు. దీంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ బెదిరింపు ఈమెయిల్ విదేశీ సర్వర్ నుంచి, ముఖ్యంగా ఇంగ్లాండ్ నుంచి వచ్చినట్టు గుర్తించారు.

ఈమెయిల్‌లో తమిళనాడులోని ఒక మంత్రిపై అవినీతి నిరోధక శాఖ చేపడుతున్న విచారణను ఆపాలని డిమాండ్ చేస్తూ, ఆ చర్యలు కొనసాగితే బాంబులు పేలుస్తామని హెచ్చరించారు. ఈ అంశాన్ని పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఈమెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కోర్టుకు ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఇది మూడోసారి. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతోంది.

ప్రతి సారి కూడా విస్తృత తనిఖీలు చేపట్టి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారిస్తున్నప్పటికీ, పోలీసులు అప్రమత్తతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా ఈ ఘటన మరోసారి కోర్టు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి తప్పుడు బెదిరింపులు ప్రజల్లో భయాందోళనలను సృష్టించడమే కాకుండా, న్యాయవ్యవస్థ పనితీరును కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, న్యాయవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply