జమ్మలమడుగులో దారుణం
( కడప, ఆంధ్రప్రభ బ్యూరో) : కడప జిల్లాలో ఓ వృద్ధ జంట దారుణ హత్య కలకలం రేపింది. ఆయనకు భార్య లేదు. ఆస్తి పరుడు. రెండు ఇటుక భట్టీలకు యజమాని. అవసాన దశలో తోడు కోసం ఓ మహిళను చేరదీశాడు. సహజీవనం చేస్తున్నారు. తన ఇటుక భట్టీల దగ్గరే ఉంటున్నారు. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ జంటను చంపేశారు. ఆ వృద్ధ జంట దగ్గర సొత్తును ఎత్తుకెళ్లారు. ఇది దోపిడీ దొంగల పనే అని స్థానికులు భావిస్తుంటే.. నేర స్థలిలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. అసలు హంతకులను గుర్తించేందుకు పోలీసు అధికారులు బిజీబిజీగా ఉన్నారు.
సంచలనం రేపిన ఈ హత్య వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగుకు చెందిన నాగప్ప అనే వృద్దుడికి – తాడిపత్రి రహదారిలో శ్రీకృష్ణ మందిరం సమీపంలోని ఓ ఇటుకల భట్టీ ఉంది. పెద్దక్క అనే వృద్ధురాలితో సహజీనం చేస్తున్నాడు. శనివారం రాత్రి ఇంటిలో నాగప్ప పెద్దక్క నిద్ర పోతుండగా అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నేర స్థలికి పోలీసులు చేరుకున్నారు. ఆ ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించారు. డెకాయిట్, మర్డర్ కేసు కావటంతో ఉన్నతాధికారులు కదిలారు. ఇక నాగప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఒక కుమారుడు తాడిపత్రిలో ఉంటున్నాడు. మరో కుమారుడు రెండవ భట్టీ నిర్వహిస్తున్నాడు. ఇక పెద్దక్క కుటుంబం వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగలు దాడి చేస్తే.. ఈ రెండు మృతదేహాలు చెల్లాచెదురవుతాయి. కానీ ఒకే మంచంపై నిద్రిస్తున్నట్టు కనిపించటంతో.. ఇది దొంగల పని కాదు.. అని పోలీసులు అనుమానిస్తున్నారు. చంపేసి మళ్లీ వీళ్లద్దరినీ ఒకే చోట పడుకొబెట్టారనే అనుమానంతో డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. ప్రస్తుతం జమ్మలమడుగులో ఈ వృద్ధ ప్రేమ జంట హత్యే చర్చనీయాంశమైంది.

