హైదరాబాద్, ఆంధ్రప్రభ : పచ్చదనం పునరుద్ధరించడంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదర్శప్రాయుడు అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జె.సంతోష్ కుమార్ అన్నారు. భూమి దినోత్సవం సందర్భంగా మంగళవారం తన ఎక్స్ వేదికగా పర్యావరణ ప్రేమికులకు, ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే కేసీఆర్ మొక్క నాటుతున్నట్లు ఓ చిత్రాన్ని కూడా పోస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన గ్రహం అందం ఉమ్మడి నిధి. చెట్లను నాటడం, పరిసరాలను శుభ్రపరచడం, అవగాహన పెంచడం ద్వారా మనం పెద్ద పరివర్తనలకు నాంది పలకవచ్చుని పేర్కొన్నారు. పచ్చదనాన్ని పునరుద్ధరించడంలో శ్రీ కేసీఆర్ గారి ఆదర్శప్రాయమైన ప్రయత్నాల నుండి ప్రేరణ పొంది, తరతరాలుగా పచ్చదనం, ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
1970 ఏప్రిల్ 22న తొలిసారి భూమి దినోత్సవ కార్యక్రమం
అమెరికాలో కాలుష్యం, పర్యావరణ క్షీణత గురించి పెరుగుతున్న ప్రజా అవగాహన తర్వాత, మొదటి ఎర్త్ డేను ఏప్రిల్ 22, 1970న జరుపుకున్నారు. విద్యార్థుల యుద్ధ వ్యతిరేక నిరసనల శక్తిని పర్యావరణ అవగాహనలోకి మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్న సెనేటర్ గేలార్డ్ నెల్సన్ దీనిని ప్రారంభించారు. అప్పట్లో ఈ కార్యక్రమంలో 20 మిలియన్ల అమెరికన్లు పర్యావరణ సంస్కరణలను డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. ఇది ఆ కాలంలో అతిపెద్ద పౌర కార్యక్రమంగా మారింది. దశాబ్దాలుగా, ఎర్త్ డే ఒక ప్రపంచ ఉద్యమంగా పరిణామం చెందింది. దీనిని 190 కంటే ఎక్కువ దేశాలలో పాటిస్తున్నారు.