E – Crop Survey | రైతులకు డ్రోన్ సేవలు..

E – Crop Survey | రైతులకు డ్రోన్ సేవలు..
- క్యాబ్ బుకింగ్ తరహాలో అందుబాటులోకి..
- రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ డా. మనజీర్ జిలాని
E – Crop Survey | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఈ – క్రాప్ సర్వే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో పెదకాకాని గ్రామంలోని అలా మల్లేశ్వరరావు మొక్కజొన్న పొలంలో నూతనంగా ఆధునికరించిన ఈ పంట వెబ్, మొబైల్ అప్లికేషన్‌లో స్వయంగా పంట నమోదు ప్రక్రియను చేపట్టారు.

రబీ 2025 -26 సీజన్ కోసం ఈ – పంట మొబైల్ అప్లికేషన్‌లో రైతులకు ఎస్ఎంఎస్ ఎలర్టులు వచ్చే విధానాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా ఆర్ఎస్కే సహాయకుడి క్షేత్ర ప్రదర్శన, పంట నమోదు తేదీ, పంట బుకింగ్ చేసిన వెంటనే నమోదు చేసిన పంట వివరాలు వెబ్ లింకుతో సహా ధ్రువీకరణ ఎస్ఎంఎస్‌లు రైతు మల్లేశ్వరరావు ఫోన్‌లో వచ్చాయో లేదో పరిశీలించారు.

అదేవిధంగా డేటా అప్లోడ్ , ఈ కేవైసీ పూర్తయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ యంత్ర పనిముట్లు సబ్సిడీపై అందించమని కోరగా సానుకూలంగా స్పందించి రాబోవు కొద్ది రోజుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ… ఏపీఎఫ్ఆర్ విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగి ఉన్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నగదు జమ, ఎరువుల లభ్యత, ధరల గురించి రైతులతో మాట్లాడారు. అధికంగా యూరియాను వాడటం వల్ల పంటలకు , భూమికి నష్టమని అధికారులు సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలని సూచించారు.

క్యాబ్ బుకింగ్ తరహాలో ఓబెరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ అనే యాప్ ద్వారా డ్రోన్ సేవలు పొందవచ్చని రైతులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి కే. రమణకుమార్, గ్రామ రైతులు పెండ్యాల శ్రీకాంత్, బెజవాడ రాఘవరావు, ఆకుల సాయిబాబు , పున్నారావు తదితరులు పాల్గొన్నారు.
