విధులు ఒకచోట… జీతం మరోచోట!

విధులు ఒకచోట… జీతం మరోచోట!
ఎవరి మెప్పుకోసం ఇలా?
జిల్లా అధికారి దాటవేసిన సమాధానం – ప్రజల్లో ఆగ్రహం
హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన
చిన్న గూడూరు, ఆంధ్రప్రభ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు కలిసి విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, పాఠశాలల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తుండగా కొంతమంది అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ శ్రమ వృథా అవుతోంది. ఇలాంటి దారుణ ఉదాహరణే చిన్న గూడూరు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ) లో చోటుచేసుకుంది. రెండు నెలలుగా హెడ్ కుక్ విధులకు హాజరుకాకపోయినా, ఆమె జీతం మాత్రం క్రమంగా విడుదల అవుతుండటం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది. విద్యార్థుల భోజనం నాణ్యత తగ్గిపోగా, మిగతా సిబ్బందిపై అదనపు భారం పడుతోంది.
ఎవరి మెప్పుకోసం ఇలా?
స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో అడుగుతున్నారు
విధులు ఒక్కచోట… జీతం మరోచోటా? ఎవరి మెప్పుకోసం ఇలా జరుగుతోంది?” అని. పాఠశాల నిబంధనల ప్రకారం హాజరు ఆధారంగా మాత్రమే జీతం చెల్లించాలనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇక్కడ ఆ నియమాలు పక్కనపెట్టబడ్డాయి.
హెడ్ కుక్ గైర్హాజరు – విద్యార్థులకు ఇబ్బంది…
హెడ్ కుక్ లేకపోవడంతో భోజనం తయారీ, సమయపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులకు సరైన ఆహారం అందడం కష్టమవుతోంది” అని విద్యార్థి తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న సిబ్బందిని నిలదీయాలని కోరుతున్నారు.
ధనుంజయ ఆవేదన..
హాస్టల్ విద్యార్థి తండ్రి ధనుంజయ మాట్లాడుతూ…. “మా పిల్లలు హాస్టల్‌లో ఉంటున్నారు. రెండు నెలలుగా హెడ్ కుక్ రావడం లేదు. భోజనం సరిగ్గా అందడం లేదు. అధికారులు మాత్రం చూస్తూ ఉన్నారు. ఇలా నిర్లక్ష్యం ఎలా అనుమతిస్తారు?” అని ప్రశ్నించారు.

జిల్లా అధికారి దాటవేసిన సమాధానం…
ఈ వ్యవహారంపై ఆంధ్రప్రభ ప్రతినిధి అధికారిని ప్రశ్నించగా వారు సమాధానం ప్రజల్లో మరింత అసంతృప్తి రేపింది. “పై అధికారులు చూస్తారు” నాకు తెలీదు అని ఒక్క మాటతో దాటవేశారు. ఇలా దాటవేసే సమాధానాలు ఇవ్వడం అంటే ప్రజా నిధుల దుర్వినియోగానికి మద్దతు ఇచ్చినట్టే అని ప్రజలు అంటున్నారు.
పారదర్శకత ఎక్కడ?
హెడ్ కుక్ హాజరు రికార్డులు బహిర్గతం చేసి, జీతం ఆమోద పత్రాలను చూపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల హెచ్చరిక…
“ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ ఇలాంటి నిర్లక్ష్యపు వ్యవహారాలు కొనసాగితే, ఆ డబ్బు ప్రయోజనం లేకుండా పోతుంది. విచారణ జరిపి న్యాయం చేయాలి” అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
వెంటనే విచారణకు కలెక్టర్ స్పందించాలి: ప్రజల డిమాండ్
హాస్టల్ కు రాకుండా వేతనం ఇచ్చిన సదరు టీచర్లపై దీనికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఘాటుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్వయంగా విచారణకు ఆదేశాలు ఇవ్వాలి, నిజాలు వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.
