హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణలో మత్తు పదర్థాల మాటే వినపకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ, నార్కోటిక్ బ్యూరో సిబ్బంది రాష్ట్రంలోనే విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌వోటీ టీం గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం శరత్ సిటీ మాల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతడి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆ యువకుడు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మాజీ సీఎస్ కుమారుడని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, టాస్క్‌ఫోర్స్ టీమ్ నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా వారితో వాగ్వాదానికి దిగినట్లుగా సమాచారం. అతను డ్రగ్స్ ఎక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చాడు. ఎవరికి హ్యాండోవర్ చేయాలనుకున్నాడనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడు కావడంతో విచారణ కూడా గుట్టుగా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.