Drone seized | యాదగిరికొండ, ఆంధ్రప్రభ : స్వయంభుగా కొలువైయున్న యాదగిరిగుట్ట కొండపై ప్రాంతంలో డ్రోన్ ఎగురవేయడం తీవ్రంగా నిషేధించబడింది. శనివారం, దేవస్థానం కొండపైన డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించబడింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఎస్పీఎఫ్ అధికారి శేషగిరిరావు ఆధ్వర్యంలో ఆ డ్రోన్‌ను పట్టుకొని, తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభించబడింది.
యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన ఉన్న ప్రాంతాన్ని ‘నో ఫ్లయింగ్ జోన్’ (No Flying Zone) గా పరిగణించడం జరుగుతుంది. ఆలయ భద్రత, శాంతి భద్రతలు మరియు ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకొని, దేవస్థానం కొండపై మరియు పరిసర ప్రాంతాలలో డ్రోన్‌లను ఎగరవేయడం లేదా డ్రోన్‌ల ద్వారా షూటింగ్ చేయడం కఠినంగా నిషేధించబడింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులు మరియు సందర్శకులు ఈ విషయమును తప్పనిసరిగా గమనించి, దేవస్థానం నియమాలను పాటించాలని ఆలయ ఈవో ఎస్ వెంకట్రావు తెలిపారు.

