పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి..

పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి..
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, ఆంధ్రప్రభ: పల్లెల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం, దస్తురాబాద్ మండలాల సర్పంచులతో స్థానిక ఎంపీడీవో సమావేశ మందిరంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచులు ప్రజలతో సమీపంగా ఉండి, వేసవికాలంలో స్వచ్ఛమైన రక్షిత తాగునీరు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ఇసుక కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను రెండు రోజుల్లో సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని తెలిపారు.
మండలంలోని కిష్టాపూర్ సమీప కేజీబీవీ పాఠశాలను, అక్కపల్లిగూడ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించారు. అలాగే పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు చలివేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి ఎం.శ్రీవాణి, అక్కపల్లిగూడ పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్, జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు లక్ష్మీనారాయణ, ఫసిహుల్ల, పొనకల్ మేజర్ సర్పంచ్ జక్కు సుష్మ-భూమేష్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు షోయెల్ షా తదితరులు పాల్గొన్నారు.
