గుక్కెడు తాగునీరు ఇవ్వండి

గుక్కెడు తాగునీరు ఇవ్వండి

  • కొండపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో జగనన్న కాలనీ ప్రజల ధర్నా

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి (ఈలప్రోలు) జగనన్న కాలనీకి తాగునీరు అందించాలని ఆ కాలనీ ప్రజలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ తమ కాలనీకి తాగునీరు సరఫరా చేయాలని, రోడ్లు నిర్మించాలని అనేక సార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. తాగునీరు కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణంలో విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు ఏర్పాటు చేసి మద్యం ఏరులై పారిస్తున్న ప్రభుత్వం జగనన్న కాలనీకి గుక్కెడు తాగునీరు సరఫరా చేయలేకపోతుందని విమర్శించారు. జగనన్న కాలనీని మున్సిపాలిటీలో అనుసంధానం చేయకుండా, కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ‘మా ఓట్లు కావాలంటే… మా కాలనీ సమస్యలు పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.మహేష్ నాయకత్వం వహించారు. జగనన్న కాలనీకి చెందిన బాలాజీ, దేవి, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply