Vakiti Srihari | క్రీడా మైదానం పేరుతో…
Vakiti Srihari | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పాత పోలీస్ క్వార్టర్ భవనాల వద్ద క్రీడా మైదానం కోసం ఈ రోజు రాష్ట్ర పాడి పరిశ్రమ మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Dr. Vakiti Srihari), నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్(Sikta Patnaik)తో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ పాత పోలీస్ క్వార్టర్స్ వెనుక భాగంలో గ్రామకంఠం భూమిలో మూడు ఎకరాల స్థలాన్ని గుర్తించేందుకు ముళ్ళ పొదలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ రోజు ముళ్లపొదలు తొలగించేందుకు జేసీబీ(JCB) యంత్రంతో ముళ్ళ పొదలు తొలగిస్తుండగా మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్మశాన వాటికలో తమ తాత ముత్తాతల కాలం నుండి సమాధులు ఉన్నాయని వాటిని తొలగించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పనులు నిలిపి వేశారు. ఈ సంఘటన తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు మాట్లాడుతూ.. క్రీడా మైదానం పేరుతో స్మశాన వాటిక తొలగిస్తే సహించేదిలేదని అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. దీంతో క్రీడా మైదానం కోసం జెసిబితో తొలగిస్తున్న ముళ్ళ పొదల పనులు నిలిచిపోయాయి.

